Delta Airlines : తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు డెల్టా ఎయిర్‌లైన్స్ రెడీ అయింది. అమెరికాలో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇవాళ అట్లాంటాలోని డెల్టా ఎయిర్ లైన్స్ కార్యాలయానికి వెళ్లారు. ఈసందర్భంగా ఆ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అండ్ సీటీఓ నారాయణన్ కృష్ణకుమార్‌తో మంత్రి భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుందని ఈసందర్భంగా శ్రీధర్ బాబు డెల్టా ఎయిర్‌లైన్స్ కంపెనీ ప్రతినిధులకు వివరించారు. ఏవియేషన్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారిన తీరును వివరిస్తూ ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. మంత్రి శ్రీధర్ బాబు ప్రజెంటేషన్‌పై సంతృప్తివ్యక్తం చేసిన కృష్ణకుమార్, డెల్టా ఎయిర్ లైన్స్ ప్రతినిధులు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేశారు.
We’re now on WhatsApp. Click to Join
అమెరికాలో పర్యటిస్తున్న తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధుల టీమ్‌లో మంత్రి శ్రీధర్ బాబుతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఉన్నారు. హైదరాబాద్ నుంచి అట్లాంటాకు నేరుగా విమాన సర్వీసును నడపాలని ఈసందర్భంగా డెల్టా ఎయిర్ లైన్స్ సీటీఓ నారాయణన్ కృష్ణకుమార్‌ను తెలంగాణ మంత్రులు కోరారు. అట్లాంటా నుంచి నేరుగా విమానాలు లేకపోవడంవల్ల అమెరికాలో విద్యాభ్యాసం కోసం వచ్చే విద్యార్ధులు, ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. ఈ అభ్యర్ధన పట్ల సానుకూలంగా స్పందించిన డెల్టా ఎయిర్ లైన్స్ ప్రతినిధులు.. హైదరాబాద్‌కు నేరుగా విమానాలు నడిపేందుకు తక్షణం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. డెల్టా ఎయిర్ లైన్స్(Delta Airlines) ప్రతినిధుల స్పందన పట్ల మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్, పెట్టుబడుల శాఖ స్పెషల్ సెక్రెటరీ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.