Cyberabad: సైబరాబాద్‌లో ట్రాఫిక్‌ టాస్క్‌ఫోర్స్‌ సేవలు ప్రారంభం..!

సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ట్రాఫిక్‌ రద్దీకి పరిష్కారం దిశగా అడుగులేస్తోంది.

  • Written By:
  • Publish Date - October 13, 2022 / 06:45 PM IST

సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ట్రాఫిక్‌ రద్దీకి పరిష్కారం దిశగా అడుగులేస్తోంది. గంటలకొద్దీ ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోకుండా సులువుగా ప్రయాణం చేసేందుకు వీలుగా ప్రత్యేక ట్రాఫిక్‌ టాస్క్‌ఫోర్స్‌ సేవలు మొదలయ్యాయి. రాష్ట్రంలో తొలిసారిగా ట్రాఫిక్‌ టాస్క్‌ఫోర్స్‌ సేవలను సైబరాబాద్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఫిక్‌ టాస్క్‌ఫోర్స్‌ కోసం మరో పది మోటార్‌ సైకిళ్లను ప్రత్యేకంగా తయారు చేయించారు. ఒక్కో బైక్‌పై ఇద్దరు చొప్పున మొత్తం 32 మంది కానిస్టేబుళ్లు ఈ టాస్క్‌ఫోర్స్‌ విధుల్లో ఉంటారు. వీరికి ఒక ఎస్సై ర్యాంక్‌ అధికారి ఇంచార్జిగా ఉంటారు. సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ శ్రీనివాస్‌ రావు ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌ పని చేస్తుంది. ట్రాఫిక్‌ టాస్క్‌ఫోర్స్‌కు అందించిన బైక్‌లలో ప్రథమ చికిత్స కిట్, పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్, డ్రంకెన్‌ డ్రైవ్‌ చెకింగ్‌ కిట్, హెల్మెట్, బాడీ వోర్న్‌ కెమెరా, షోల్డర్‌ లైట్, మాన్‌ ప్యాక్, కెమెరా, రిఫ్లెక్టివ్‌ జాకెట్, కళ్లద్దాలు, ఎల్‌ఈబా బాటన్‌ తదితర వస్తువులు ఉంటాయి.

ట్రాఫిక్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు వారి బైక్‌లకు ఉన్న ద్విచక్ర వాహనానికి ఉన్న పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్‌ ద్వారా ట్రాఫిక్‌ సంబంధించిన అంశాలపై ప్రజలకు ఎప్పటికప్పుడు తగు సూచనలు చేస్తుంటారు. పీక్‌ అవర్స్‌లో ట్రాఫిక్‌ రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఈ టాస్క్‌ఫోర్స్‌ బృందాలు పెట్రోలింగ్‌ తిరుగుతుంటాయి. ట్రాఫిక్ జామ్‌ల‌ను నివారించడంతో పాటు రోడ్లపై అడ్డుగా నిలిచే వాహనాలను క్లియర్‌ చేయడం, నో పార్కింగ్‌ ప్లేస్‌లో ఉన్న వాహనాలను తొలగించడం వంటివి చేస్తాయి.

లా అండ్‌ ఆర్డర్‌ పోలీసుల సమన్వయంతో పనిచేస్తుంటారు. ఏదైనా చైన్‌ స్నాచింగ్‌లు జరిగినప్పుడు కంట్రోల్‌ రూమ్‌ నుంచి కాల్‌ రాగానే వెంటనే అప్రమత్తమై స్నాచర్స్‌ను పట్టుకునే ప్రయత్నం చేస్తారు. చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగులు రోడ్డు దాటే విషయంలోనూ సహాయం చేస్తారు. పెట్రోలింగ్‌ చేసే సమయంలో ప్రజలకు వారి వాహనాలకు ఏదైనా సమస్య వస్తే వీరు దగ్గరుండి సాయం చేస్తారు.

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అత్యంత ట్రాఫిక్ రద్దీ ఉన్న ప్రాంతాలలో ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించడానికి టాస్క్ ఫోర్స్ వెహికల్స్ ను సైబరాబాద్ పోలీసులు ఏర్పాటు చేశారు. ఆగస్ట్ నెలలో ప్రారంభించిన 6 ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ బైక్స్.. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుండటంతో వీటికి అదనంగా మరో 10 వాహనాలను సైబరాబాద్‌లో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ వెహికల్స్ కమాండ్ కంట్రోల్ పర్యవేక్షణలో పనిచేస్తాయి.