Site icon HashtagU Telugu

CMO Vs PCCF: సీఎంఓ వర్సెస్ పీసీసీఎఫ్‌.. ఐఎఫ్ఎస్ అధికారుల టూర్‌పై వివాదం

Cmo Vs Pccf Telangana Ifs Officers Foreign Tour Telangana Cm Revanth Pccf Rm Dobriyal

CMO Vs PCCF: తెలంగాణ ఐఎఫ్ఎస్ అధికారుల బృందం కెన్యా, టాంజానియా పర్యటనపై వివాదం రాచుకుంది. ఎకో టూరిజం అభివృద్ధి కోసం ఆయా దేశాల్లో అమలు చేస్తున్న విధానాలపై అధ్యయనం కోసం వీరంతా పర్యటనకు వెళ్లారు. అది కూడా  సీఎస్‌ శాంతికుమారి అనుమతితోనే. దీనిపై ఫిబ్రవరి 18న సీఎస్‌ శాంతికుమారి జీవోఆర్టీ నంబరు 224ను జారీ చేశారు. ఈ పర్యటనకు అయ్యే ఖర్చును తెలంగాణ ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి తీసుకోవాలని సూచించారు.  దీంతో ఫిబ్రవరి 20 నుంచి 27 వరకు ఆరుగురు ఐఎఫ్ఎస్ అధికారుల బృందం కెన్యా, టాంజానియా దేశాల్లో పర్యటించింది.  అంతా క్లియర్‌గానే ఉంది.

అధికారులు పర్యటనలో ఉండగానే మెమోలు

అయితే ఈ పర్యటనకు వెళ్లి వచ్చిన ఐఎఫ్ఎస్(CMO Vs PCCF) అధికారులకు ఫిబ్రవరి 22న తెలంగాణ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్ (పీసీసీఎఫ్‌) డోబ్రియాల్‌ మెమోలు జారీ చేశారు. తనకు చెప్పకుండా విదేశీ పర్యటనకు  ఎలా వెళ్లారంటూ వారి నుంచి సంజాయిషీ కోరారు. కెన్యా, టాంజానియా పర్యటనకు వెళ్లిన చంద్రశేఖర్‌రెడ్డి మినహా మిగిలిన ఐఎఫ్ఎస్ అధికారులంతా తన కిందే పనిచేస్తున్నారని  మెమోల్లో డోబ్రియాల్‌ గుర్తు చేశారు. ‘‘ఈ పర్యటనకు వెళ్లిన అధికారులంతా తమ విదేశీ పర్యటన వివరాలను డాక్యుమెంటరీ ఆధారాలతో విడివిడిగా నాకు సమర్పించాలి. మార్చి 10లోగా వీటిని సమర్పించాలి. లేదంటే విదేశీ పర్యటన వివరాలను దాచిపెట్టినట్టుగా భావించాల్సి ఉంటుంది. ప్రవర్తనా నియమావళిని  ఉల్లంఘించినట్టుగా పరిగణించాల్సి ఉంటుంది’’ అని డోబ్రియాల్‌ జారీ చేసిన మెమోల్లో ఉంది. అధికారులు పర్యటనలో ఉండగానే వారికి మెమోలను జారీ చేయడం గమనార్హం. తెలంగాణ సీఎస్ శాంతికుమారి అనుమతితోనే ఐఎఫ్ఎస్ అధికారులు టూర్‌కు వెళ్లినా, డోబ్రియాల్ మెమోలు ఇవ్వడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

Also Read :Meenakshi Natarajan : మీనాక్షి మార్క్.. టీపీసీసీ కార్యవర్గం ఎంపికలో మారిన లెక్క

సీఎంఓ కార్యదర్శి జి.చంద్రశేఖర్‌రెడ్డి కూడా..

విదేశీ పర్యటనకు వెళ్లిన అధికారుల్లో.. శాంతారామ్‌ ప్రాజెక్టు టైగర్‌ ఫీల్డ్‌ డైరక్టర్‌ సునీతా ఎం.భగవత్‌ (అడిషనల్‌ పీసీసీఎఫ్‌ అడ్మిన్‌), జూపార్కు డైరక్టర్‌ డాక్టర్‌ సునీల్‌ ఎస్‌.హిర్మనాథ్‌, నల్లగొండ, నాగర్‌కర్నూల్‌ డీఎఫ్‌ఓలు పేట్ల రాజశేఖర్‌, గోపిడి రోహిత్‌, ఎకో టూరిజం ఈడీ ఎల్‌.రంజిత్‌ నాయక్‌ ఉన్నారు. ఐఎఫ్ఎస్ అధికారులతో కలిసి ఈ పర్యటనకు వెళ్లిన వారిలో ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి జి.చంద్రశేఖర్‌రెడ్డి కూడా ఉన్నారు. ఈయన సీఎంవోలో అటవీశాఖను పర్యవేక్షిస్తుంటారు. అయినా ఐఎఫ్ఎస్ అధికారులకు డోబ్రియాల్‌ నోటీసులు పంపడం గమనార్హం.

Also Read :Bus Crash: బస్సులు ఢీ.. 37 మంది మృతి, 39 మందికి గాయాలు