CM Revanth Reddy : మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి సహా వాళ్లను స్మరించుకోవాలి

CM Revanth Reddy : ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో రెండు దశాబ్దాల తరువాత తొలిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించి ఘనంగా ప్రసంగించారు. తెలంగాణ పుట్టుకలో, పోరాట చరిత్రలో ఈ యూనివర్సిటీకి ఉన్న ప్రాధాన్యతను ఆయన విశదీకరించారు.

Published By: HashtagU Telugu Desk
Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy : ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో రెండు దశాబ్దాల తరువాత తొలిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించి ఘనంగా ప్రసంగించారు. తెలంగాణ పుట్టుకలో, పోరాట చరిత్రలో ఈ యూనివర్సిటీకి ఉన్న ప్రాధాన్యతను ఆయన విశదీకరించారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “తెలంగాణ, ఉస్మానియా యూనివర్సిటీ రెండూ అవిభక్త కవలల్లాంటివి. 1938 సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరిలూదిన గడ్డ ఇది. శివరాజ్ పాటిల్, పీవీ నర్సింహారావు, జైపాల్ రెడ్డి లాంటి గొప్ప నాయకులను అందించింది. తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించింది. మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి సహా యాదయ్య, ఇషాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి వంటి త్యాగధనులను స్మరించుకోవాలి” అని అన్నారు.

గత పదేళ్ల పాలనలో ఉస్మానియా యూనివర్సిటీని నిర్వీర్యం చేసేందుకు కుట్ర జరిగిందని, ఇకపై ఆ పాత వైభవాన్ని తిరిగి తీసుకురావడమే తమ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వీసీలను నియమించామని, విద్యార్థుల చైతన్యం సమాజానికి మార్గదర్శకమని చెప్పారు. దేశానికి యువ నాయకత్వం అవసరమని, 21 ఏళ్ల వయసులో IAS లు సేవలందిస్తుంటే, అదే వయసులో యువకులు శాసనసభలో ఎందుకు అడుగుపెట్టకూడదని ప్రశ్నించారు. యువతను గంజాయి, డ్రగ్స్ వ్యసనాల నుంచి బయటపడేలా కృషి చేయాలని, చదువుతోనే తలరాతలు మారుతాయని రేవంత్ స్పష్టం చేశారు.

HYD – Amaravati : హైదరాబాద్‌-అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే- త్వరలోనే మార్గం ఖరారు?

“నా దగ్గర పంచడానికి భూములు లేవు, ఖజానా లేదు. మీకు ఇవ్వగలిగింది విద్య ఒక్కటే. చదువే మిమ్మల్ని ధనవంతుల్ని, గుణవంతుల్ని చేస్తుంది” అని ఆయన స్పష్టం చేశారు. పేదరికాన్ని ఎదుర్కొన్న అనుభవం మాకే ఎక్కువగా తెలుసని, దాన్ని పారద్రోలడం తమ ధ్యేయమని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి ఇంజనీర్ల కమిటీ వేయాలని అధికారులను ఆదేశించినట్టు ప్రకటించిన సీఎం, “ఉస్మానియా యూనివర్సిటీని స్టాన్‌ఫర్డ్, ఆక్స్‌ఫర్డ్ స్థాయిలో తీర్చిదిద్దుతాం. యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఏం కావాలో అడగండి, అంచనాలు తయారు చేసి ఇవ్వండి. మళ్లీ యూనివర్సిటీకి వచ్చి నిధులు మంజూరు చేస్తాను” అని హామీ ఇచ్చారు.

విద్యార్థుల నిరసనలకు పోలీసులు అడ్డంకులు కలిగించవద్దని ఆదేశించిన ఆయన, కోదండరాం సార్ పై జరిగిన కుట్రను తప్పుబట్టారు. మళ్లీ ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై దుష్ప్రచారం జరుగుతోందని విమర్శించిన రేవంత్ రెడ్డి, “తెలంగాణలో సింహాలు, ఏనుగులు లేవు, మానవ రూపంలో ఉన్న మృగాలు ఉన్నాయి. వాళ్లు సమాజానికి చెదలు లాంటివారు. వాళ్లు మళ్లీ వస్తే ఉస్మానియా యూనివర్సిటీ ఉండనివ్వరు” అని వ్యాఖ్యానించారు. చివరిగా, “ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి బాధ్యత నాది. మీ చదువుకు ఏం కావాలో అడగండి. ఈ యూనివర్సిటీ చరిత్రకు నిలువెత్తు సాక్షిగా నిలవాలి” అని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

UP : డాక్టర్ జేబులో నుండి ఐఫోన్‌ దొంగిలించి పట్టుబడ్డ దొంగ

  Last Updated: 25 Aug 2025, 01:51 PM IST