CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎనిమిది రోజుల పర్యటనలో భాగంగా జపాన్ చేరుకున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటినుండే తెలంగాణ అభివృద్ధికి గ్లోబల్ స్థాయిలో పెట్టుబడులు అవసరమన్న దృక్పథాన్ని వ్యక్తపరిచిన సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు వేగవంతం చేశారు. ఈ పర్యటనలో భాగంగా టోక్యో, మౌంట్ ఫుజి, ఒసాకా, హిరోషిమాలో పర్యటించనున్నారు. అలాగే ఒసాకాలో జరిగే ఇండస్ట్రియల్ ఎక్స్‌పో లో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. అనంతరం టోక్యోలో పెట్టుబడులపై పలు పారిశ్రామికవేత్తలతో సమావేశం జరగనుంది.
Read Also: Justice BR Gavai: తదుపరి సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్.. నేపథ్యమిదీ
తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ కోసం జపాన్ సాంకేతిక అభివృద్ధిని అధ్యయనం చేయడంతో పాటు, అభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడి వ్యాపారవేత్తలను, వివిధ సంస్థలను ఆహ్వనించనున్నట్లు తెలుస్తుంది. జపాన్ లోని కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఏఐ ఆధారిత అభివృద్ధిపై జపాన్ వెళ్లిన సీఎం బృందం అధ్యయనం చేయనుంది. ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు, ఇతర అధికారులు ఉన్నారు.
కాగా, ఏప్రిల్ 21న ఒసాకాలో నిర్వహించనున్న వరల్డ్ ఎక్స్‌పో – 2025లో తెలంగాణకు కేటాయించిన పవిలియన్‌ను సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు. అదే రోజు ఒసాకాలో బిజినెస్ రౌండ్‌టేబుల్ సమావేశంలో సీఎం పాల్గొననున్నారు. ఇక, సీఎం రేవంత్ హిరోషిమాకు చేరుకుని పీస్ మెమోరియల్ సందర్శించనున్నారు. అక్కడ గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, హిరోషిమా వైస్ గవర్నర్, అసెంబ్లీ చైర్మన్‌లతో భేటీ అవుతారు. సుమిదా రివర్ ఫ్రంట్, మౌంట్ ఫుజీ, అరకురయామా పార్క్, కిటాక్యూషు సిటీ ఎకో టౌన్ ప్రాజెక్టులు, ఎన్విరాన్‌మెంట్ మ్యూజియం, మురసాకి రివర్ మ్యూజియం లాంటి ప్రాజెక్టులను సందర్శించి సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణలో వాటి పాత్రను అధ్యయనం చేయనున్నారు.
Read Also: BJP : ఈ పత్రికను గాంధీ కుటుంబం తమ ప్రైవేట్ ఏటీఎంగా వాడుకున్నారు : బీజేపీ