తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న భారీ వర్షాల (Heavy Rains) నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth ) అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వాతావరణ శాఖ ప్రకారం మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో, రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తత అవసరమని సీఎం సూచించారు. హైదరాబాద్ సహా అనేక జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు పడుతుండటంతో, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Good News : ఇందిరమ్మ లబ్దిదారులకు గొప్ప శుభవార్త తెలిపిన సీఎం రేవంత్
హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో నిర్వహించిన సమావేశంలో, రేవంత్ రెడ్డి వర్షాల ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేసేందుకు సూచించారు. రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా తగిన మౌలిక సదుపాయాలను అందుబాటులో ఉంచాలని, ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్ సరఫరా వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.
రైతులు కూడా ఈ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడవకుండా తక్షణ రక్షణ చర్యలు తీసుకోవాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని ఆదేశించారు. జిహెచ్ఎంసి పరిధిలో వివిధ విభాగాలు , పోలీసులు, హైడ్రా, విద్యుత్ శాఖలు , పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిన సీఎం, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.