CM Revanth: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) మంత్రులు, అధికారులతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లో రైతుల సంక్షేమం, ధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సంవత్సరం రుతుపవనాలు 15 రోజుల ముందుగా వచ్చిన నేపథ్యంలో, రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 64.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగిందని, 90 శాతం సేకరణ పూర్తయిందని సీఎం పేర్కొన్నారు. ఈ విజయానికి అధికారులు, కలెక్టర్లను అభినందించారు.
ధాన్యం కొనుగోలు కోసం రైతులకు రూ. 12,184 కోట్లు చెల్లించినట్లు, 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్లు సీఎం తెలిపారు. అయితే రుతుపవనాల ముందస్తు రాకతో మిగిలిన ధాన్యం సేకరణలో సవాళ్లు ఎదురవుతున్నాయని, దీన్ని అధిగమించేందుకు స్థానిక గోడౌన్లను అద్దెకు తీసుకోవాలని ఆదేశించారు. మిల్లర్లు, దళారులు రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.
Also Read: KCR: కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్.. ఆ లేఖ తర్వాతే ఎందుకు?
రాజకీయ ప్రేరేపిత దుష్ప్రచారాన్ని ఎదుర్కొనేందుకు కలెక్టర్లు ప్రోయాక్టివ్‌గా ఉండాలని, ధాన్యం కొనుగోలు వివరాలను ప్రజలకు వెల్లడించాలని సీఎం సూచించారు. ఉదాహరణకు, ఒక రైతు అనారోగ్యంతో మరణించిన సంఘటనను ధాన్యం కొనుగోలుతో ముడిపెట్టి తప్పుడు ప్రచారం జరిగిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ అధికారులను 29 శాతం అధిక వర్షపాతం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, విత్తనాలు, ఎరువులను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. నకిలీ విత్తనాల విక్రయంపై కఠిన చర్యలు, అవసరమైతే పీడీ యాక్ట్ విధించాలని, రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.
భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించాలని, జూన్ 3 నుంచి 20 వరకు మూడో దశ రెవెన్యూ సదస్సులు జరపాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని, కొత్త టెక్నాలజీని వినియోగించాలని, ఉచిత ఇసుక కూపన్లు సకాలంలో అందించాలని సూచించారు. మండల స్థాయిలో ధరల నియంత్రణ కమిటీలు ఏర్పాటు చేయాలని, ఇటుక తయారీ, సెంట్రింగ్ యూనిట్లకు రుణాలు అందించాలని ఆదేశించారు. మే 29, 30 తేదీల్లో జిల్లా ఇంచార్జ్ మంత్రులు పర్యటించాలని, జూన్ 1 నాటికి పూర్తి నివేదిక సమర్పించాలని, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని సీఎం ఆదేశించారు.