Dussehra: శరన్నవరాత్రుల ముగింపు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అయిన దసరా పండుగ (Dussehra) సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ పండుగను దేశవ్యాప్తంగా విజయదశమి పేరుతో ఘనంగా జరుపుకుంటున్నారని, ఇది చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నమని ఆయన గుర్తు చేశారు.
దసరా పండుగ తెలంగాణ సబ్బండ వర్గాల ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తుందని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతిలోని ప్రత్యేక అంశాలను ఆయన ప్రస్తావించారు. శమీ పూజ చేసి, జమ్మి ఆకును బంగారంగా భావించి అలాయ్ బలాయ్ తీసుకోవడం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, శుభసూచకంగా భావించే పాలపిట్టను దర్శించుకోవడమని సీఎం గుర్తు చేశారు. ఈ ఆచారాలు తెలంగాణకు ప్రత్యేకమని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం అప్రతిహత విజయాలతో అభివృద్ధి సాధించాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఈ పండుగ జరుపుకోవాలని తాను దుర్గామాతను ప్రార్థించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
Also Read: Vijayadashami: రేపే దసరా.. విజయదశమి నాడు ఏం చేయాలి? ఏం చేయకూడదు?
మంత్రి శుభాకాంక్షలు
విజయదశమి పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఈ పవిత్రమైన సందర్భంగా ఆయన బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి, దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.
దసరా శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు దసరా పండుగ (విజయదశమి) శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి పండుగ యొక్క జీవన తాత్వికతను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. మనిషి తనలోని చెడుపై నిత్యం పోరాటం చేస్తూ, మంచి దిశగా విజయం సాధించాలనే సందేశాన్ని ఈ పండుగ మనకు అందిస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు.