CM Chandrababu: తెలంగాణలో పవన్ సభపై స్పందించిన చంద్రబాబు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద తెలంగాణకు చెందిన కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. రాష్ట్ర విభజన జరిగి 12 సంవత్సరాలు గడిచిపోయాయని.. ప్రశాంతతను చెడగొట్టవద్దని సూచించారు. ప్రజలకు సేవ చేయడంలో పోటీ పడాలి కానీ.. ఇలాంటి వాటిలో కాదన్నారు. తెలంగాణకు ఎవరు ఎంత చేశారనే దానిపై అక్కడి ప్రజలకు అవగాహన ఉందని చంద్రబాబు అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ పర్యటన తెలుగు రాష్ట్రాలలో ఎంత […]

Published By: HashtagU Telugu Desk
CM Chandrababu: Chandrababu Responds to Pawan's Meeting in Telangana

CM Chandrababu: Chandrababu Responds to Pawan's Meeting in Telangana

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద తెలంగాణకు చెందిన కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. రాష్ట్ర విభజన జరిగి 12 సంవత్సరాలు గడిచిపోయాయని.. ప్రశాంతతను చెడగొట్టవద్దని సూచించారు. ప్రజలకు సేవ చేయడంలో పోటీ పడాలి కానీ.. ఇలాంటి వాటిలో కాదన్నారు. తెలంగాణకు ఎవరు ఎంత చేశారనే దానిపై అక్కడి ప్రజలకు అవగాహన ఉందని చంద్రబాబు అన్నారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ పర్యటన తెలుగు రాష్ట్రాలలో ఎంత సంచలనం రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున పవన్ కళ్యాణ్.. ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ’ పేరుతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అయితే శాంతిభద్రతల సమస్య కారణంగా పోలీసులు అందుకు అనుమతి ఇవ్వలేదు. ఈ వ్యవహారంపై తెలంగాణ జనసేన నేతలు భగ్గుమన్నారు. కోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆ తర్వాత మంగళవారం సాయంత్రం పవన్ కళ్యాణ్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసం వద్ద ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ‘తెలంగాణ మీ అయ్య జాగీరా’ అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో కలకలం రేపాయి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన పలువురు నేతలు కూడా స్పందించారు. ఈ క్రమంలోనే తెలంగాణలో పవన్ కళ్యాణ్‌ను తిరగనివ్వమంటూ కొంతమంది కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి విధానం సరైనది కాదని సూచించారు.

ఇది కరెక్ట్ కాదు. నేను తమిళనాడుకు వెళ్లి ఎన్నికల ప్రచారం చేశాను. అక్కడికి డీకే శివకుమార్ కూడా వచ్చారు. అన్ని పార్టీల నేతలూ వచ్చారు. అక్కడ (తెలంగాణలో) కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ మొన్నటి వరకూ నేషనల్ పార్టీ అంటూ ఆంధ్రలోనూ యూనిట్ పెట్టారు. ఎందుకు ఇలా మాట్లాడతారో అర్థం కాదు. ఇది కరెక్ట్ కాదు. అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు పలుచోట్ల సెనేటర్లు అవుతున్నారు. ఎవరైతే మంచిగా పనిచేస్తారో వారు అవుతున్నారు. ఇక్కడ మాత్రం ఇది మంచి విధానం కాదు. ప్రజలకు మెరుగైన సేవలు అందించటంలో పోటీ పడాలి కానీ.. ఇలాంటివి లేనిపోనివి మాట్లాడి ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టకూడదు. విభజన జరిగి 12 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఎవరెవరు ఎంత పనిచేశారో అక్కడున్న ప్రజలకు తెలుసు. మనం దీన్ని చెడగొట్టకుండా లాజికల్‌గా ముందుకు తీసుకెళ్లాలి. అది వదిలిపెట్టి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

మరోవైపు తెలంగాణలో తనను తిరగనివ్వమన్న వారిపై ఫైర్ అయిన పవన్ కళ్యాణ్.. ఇదేమైనా వారి అయ్య జాగీరా అంటూ మండిపడ్డారు. ఎవరేమనుకున్నా తన గుండెల్లో తెలంగాణ ఉంటుందన్న పవన్ కళ్యాణ్.. జీహెచ్ఎంసీ ఎన్నికలు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు.

తెలంగాణలో అధికారం చేపట్టాలనేది తమ కోరిక కాదని.. మార్పు మీద తమ ప్రేమ అంటూ చెప్పుకొచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత, మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటరిచ్చారు. నటుడిగా, ఏపీ డిప్యూటీ సీఎంగా ఆయనను గౌరవిస్తామని.. అంతే కానీ తమపై పెత్తనం చేయాలని చూస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.

  Last Updated: 03 Jun 2026, 04:31 PM IST