తెలంగాణలో ఇక నుంచి జనసేన పార్టీ ఉంటుందని ప్రకటించిన పవన్ కళ్యాణ్.. జీహెచ్ఎంసీ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ కలిసి వచ్చినా రాకపోయినా.. తాము ఒంటరిగానైనా బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. అవసరమైతే తెలంగాణలో తానే రంగంలోకి దిగి తిరుగుతానని.. ప్రతి సమస్యపైనా మాట్లాడుతానని.. ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటానని కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో జనసేన పార్టీని అడ్డుకోవాలని చూస్తున్నారని పేర్కొన్న ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఇక తెలంగాణపై ఫోకస్ పెడుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఇక నుంచి తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుందని తేల్చి చెప్పారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ నిర్వహించాల్సిన ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ’ రద్దు కావడంతో.. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జరిగే అన్ని ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీలో ఉంటుందని స్పష్టం చేశారు. ఏ పార్టీ వచ్చినా రాకపోయినా, సింగిల్‌గానైనా జనసేన బరిలో ఉంటుందని వెల్లడించారు.
తెలంగాణపై తనకు ఉన్న ప్రేమను ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. తాను ఇప్పటి వరకు నిర్ణయించుకోలేదని.. కానీ ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నానంటూ.. తెలంగాణలో జనసేన పార్టీ భవితవ్యంపై క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుందని.. తాము పోటీ చేస్తామని ప్రకటించారు. అవసరమైతే తెలంగాణలో తిరుగుతామని.. తానే తిరుగుతానని వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి సమస్య మీద మాట్లాడి.. పోరాటం చేస్తామని తెలిపారు. ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటామని వివరించారు. భారతదేశంలో తెలంగాణ ఒక అంతర్భాగమని.. అది మర్చిపోకండి అంటూ తనపై విమర్శలు గుప్పిస్తున్న వారికి పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
2029 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ కచ్చితంగా పోటీలో ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, బీజేపీలతో కలిసి ఎన్డీఏ కూటమిలో కొనసాగుతున్న జనసేన పార్టీ.. తెలంగాణలో కూడా అదే పొత్తును కొనసాగిస్తుందా అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. పొత్తుల గురించి ఎవరి పార్టీ వారు వారి అభిప్రాయాన్ని చెబుతారని పేర్కొన్నారు. అది తనకు తెలియదని స్పష్టం చేశారు. ఇక.. తెలంగాణలో బీజేపీ జనసేనతో కలిసి వస్తుందో లేదో కూడా తనకు తెలియదని పవన్ కళ్యాణ్ తెలిపారు.
ఇక ఇటీవల మాట్లాడిన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు.. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగుతుందని ప్రకటించారని గుర్తు చేసిన పవన్ కళ్యాణ్.. తాను కూడా తెలంగాణ జనసేన నేతలకు సొంతంగా పోటీ చేసుకునే స్వేచ్ఛ ఇస్తానని వెల్లడించారు. జీహెచ్ఎంసీ మాత్రమే కాకుండా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఈ సందర్భంగా ప్రకటించారు.
ఇక జనసేన సభ నిర్వహణకు తెలంగాణ పోలీసులు అనుమతి ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టిన పవన్ కళ్యాణ్.. జనసేన వస్తే తెలంగాణలో అధికారం కోసం కాదని.. ప్రజలను చైతన్యవంతులను చేయడానికి వస్తుందని తెలంగాణ నేతలకు భయమని వ్యాఖ్యానించారు. తెలంగాణలోని 4 కోట్ల మంది జనాభాలో జనసేన పార్టీకి లక్ష మంది మద్దతుదారులు కూడా లేరని తెలిపారు. 2 వేల మంది జనసేన కార్యకర్తలతో సభ నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వలేదంటే ఇంకేం చేస్తారని పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
