తెలంగాణ ఇక్కడున్న నాలుగు కోట్ల మంది భూమి పుత్రుల జాగీరని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. అయితే, ఇక్కడికి ఎవరైనా రావొచ్చని స్పష్టం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణకు వస్తే అడ్డుకుంటామని ఎవరూ చెప్పలేదని పేర్కొన్నారు. అయితే తెలంగాణ ఆవిర్భావం రోజు హైదరాబాద్‌లో సభ పెడతానంటే ఎలా? అని ప్రశ్నించారు. ‘‘తెలంగాణ మీ అయ్య జాగీరా?’’ అంటూ మంగళవారం పవన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రాంతీయవాదం.. ఉగ్రవాదం కంటే ప్రమాదం అన్న పవన్ వ్యాఖ్యలను కేటీఆర్ తప్పుబట్టారు. మద్రాస్ నుంచి వేర్పాటు కోసం ఆత్మబలిదానం చేసిన పొట్టి శ్రీరాములుది కూడా ప్రాంతీయవాదమేనా అని ప్రశ్నించారు. తెలంగాణకు వస్తున్న అనేక పరిశ్రమలను ప్రధాని మోదీ తన స్వరాష్ట్రం గుజరాత్‌కు తరలించుకుపోతున్నారని కేటీఆర్ ఈ సందర్భంగా ఆరోపించారు. ‘‘జాతీయవాదం ముసుగులో మోదీ చేస్తున్న ఆర్థిక ప్రాంతీయవాదాన్ని ఏమంటారు?’’ అని ప్రశ్నించారు.
దేశంలో ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చని కేటీఆర్ అన్నారు. అలాగే ఎక్కడైనా పోటీ చేసే హక్కు ఉందని తెలిపారు. జనసేన కొత్తగా పోటీ చేసేదేముందని.. 2018, 2023లో జనసేన తెలంగాణలో పోటీ చేయలేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడినప్పుడు 11 రోజులు అన్నం తినలేదన్న పవన్ వ్యాఖ్యలను ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తుచేశారు. అదే వ్యక్తి మళ్లీ తెలంగాణకు వ్యతిరేకం కాదంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణకు ‘ఓజీ’ కేసీఆర్ అని.. ఇంకెవ్వరూ అవసరం లేదన్నారు.
ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్‌ను గౌరవిస్తామని కేటీఆర్ అన్నారు. సోదరుడిగా ఇంటికొస్తే బిర్యానీ పెడతామని వ్యాఖ్యానించారు. సినీ నటుడిగా, కళాకారుడిగా అభిమానిస్తాం. కానీ, సెక్రటేరియట్‌లోకి వచ్చి పెత్తనం చేస్తామంటే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు.
