కేంద్ర హోంశాఖకు ఫిర్యాదులు అందడంతో..
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలోని పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌ల ఆస్తులు(Central Intelligence) బాగా పెరిగాయట. దీనిపై కొందరు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదులు పంపారట. తమ ఫిర్యాదులకు బలాన్నిచ్చే కొన్ని ఆధారాలను కూడా హోంశాఖకు అందించారట. వాటి ఆధారంగానే ఇప్పుడు ఫీల్డ్ లెవల్‌లో సదరు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల ఆస్తుల వివరాలపై రహస్యంగా సమాచార సేకరణ జరుగుతోందట. కొందరు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల బినామీల వివరాలను ట్రాక్ చేసే ప్రయత్నంలో సదరు నిఘా విభాగాలు ఉన్నాయట. ఆయా బినామీల పేరుతో ఉన్న ఖరీదైన విల్లాలు, ప్లాట్ల చిట్టాను రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నారట.
డీఓపీటీకి సమాచారాన్ని ఇవ్వకుండా దాచి..
గత బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ పనులు చేసిన కాంట్రాక్టర్లు, సర్కారు వద్ద రాయితీలు పొందిన రియల్టర్లు, బిల్డర్ల సహకారంతో సదరు ఐఏఎస్, ఐపీఎస్‌లు ఆస్తులను కూడబెట్టారని తెలుస్తోంది. ప్రతీ క్యాలెండర్ ఇయర్ ప్రారంభంలోనే ఆల్ ఇండియా సర్వీసులోని ప్రతి అధికారి తమ స్థిరాస్తుల వివరాలను హోంశాఖ పరిధిలోని డీఓపీటీ(డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్)కి పంపాలి. తమ పేరిట, కుటుంబ సభ్యుల పేరిట కొన్న భూములు, ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల సమాచారాన్ని అందులో పొందుపర్చాలి. కానీ బీఆర్ఎస్ హయాంలో ఆస్తులు కొన్న ఐఏఎస్, ఐపీఎస్‌లు కొందరు.. ఆ వివరాలను డీవోపీటీకి చెప్పలేదని గుర్తించారు.