Site icon HashtagU Telugu

MLC Kavitha : తెలంగాణలో ‘కుల గణన’ కోర్టుల్లో నిలుస్తుందా.. సర్కారు చెప్పాలి : కవిత

Brs Mlc Kavitha Caste Survey Report To Telangana Bc Commission

MLC Kavitha : బీసీ రిజర్వేషన్లపై ‘తెలంగాణ జాగృతి’ సంస్థ రూపొందించిన అధ్యయన నివేదికను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ‘తెలంగాణ బీసీ కులగణన ప్రత్యేక కమిషన్’‌ ఛైర్మన్‌కు అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘తెలంగాణ జాగృతి’ సంస్థ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. మహిళలు, బీసీలు, దళితుల అభ్యున్నతి కోసం తమ సంస్థ చేస్తున్న పోరాటాల గురించి కవిత వివరించారు. అయితే ఈ నివేదికను అందించే క్రమంలో ‘బీఆర్ఎస్ పార్టీ’ అనే పదాన్ని ఆమె ఒక్కసారి కూడా ప్రస్తావించకపోవడం గమనార్హం. దీంతో కవిత రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ? ‘తెలంగాణ జాగృతి’ని రాజకీయ రూపంలోకి తీసుకురాబోతున్నారా ? అనే అనుమానాలకు మరింత బలం పెరిగింది.

Also Read :Dogs Care Centers : కుక్కల కోసం ప్రతి జిల్లాలో సంరక్షణ కేంద్రం.. సర్కారు యోచన 

‘తెలంగాణ బీసీ కులగణన ప్రత్యేక కమిషన్’‌కు నివేదికను అందించిన అనంతరం మీడియాతో కవిత మాట్లాడుతూ.. ‘‘ మేం ‘తెలంగాణ జాగృతి’ ఆధ్వర్యంలో తయారు చేయించిన సమగ్ర నివేదికను బీసీ రిజర్వేషన్స్ డెడికేటెడ్ కమిషన్‌కు అందించాం. బీసీ వర్గాలకు జరగాల్సిన న్యాయం జరగలేదు. రాజ్యాంగం ప్రకారం బీసీలకు హక్కులు కల్పించలేదు. రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాతే బీసీలకు న్యాయం జరిగేే ప్రక్రియ మొదలైంది. ప్రాంతీయ పార్టీల సహకారం వల్లే బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా రాణించారు’’ అని ఆమె చెప్పారు. ‘‘బీజేపీ కులగణనకు వ్యతిరేకం. ఆ విషయాన్ని బీజేపీ సుప్రీంకోర్టులో కూడా చెప్పింది. బీజేపీ డీఎన్ఏయేనే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకం’’ అని కవిత(MLC Kavitha) విమర్శించారు.

Also Read :Ram Gopal Varma : రాంగోపాల్‌ వర్మ ఇంటికి ఒంగోలు పోలీసులు.. ఆర్జీవీ ఫోన్ స్విచ్ఛాఫ్ ?

‘‘బీసీలకు స్థానిక సంస్ధల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ హామీ ప్రకారం కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేయాలి. బీసీ డెడికేషన్ కమిషన్‌ను చాలా ఆలస్యంగా ఏర్పాటు చేశారు. నెల రోజుల్లోగా ఈ కమిషన్ రిపోర్ట్ ఎట్లా ఇస్తుంది ?’’ అని తెలంగాణ ప్రభుత్వాన్ని కవిత ప్రశ్నించారు.  ‘‘తెలంగాణలో నిర్వహిస్తున్న కులగణన కోర్టుల్లో నిలబడుతుందా లేదా అనేది రాష్ట్ర ప్రభుత్వమే చెప్పాలి. బీసీల అనుమానాలను కాంగ్రెస్ ప్రభుత్వం నివృతి చేయాలి’’ అని ఆమె అడిగారు. ‘‘హైదరాబాద్,రంగారెడ్డి జిల్లాల్లో అనేక చోట్ల ఇంటికి స్టిక్కర్లు అంటించలేదు. డెడికేటెడ్ కమిషన్ ఇండిపెండెంట్ గా పని చేయాలి. కమిషన్ రిపోర్ట్ రాజకీయ రిజర్వేషన్లకు పరిమితం కాకూడదు. ఇతర బీసీ అంశాలపై కూడా నివేదిక ఇవ్వాలి’’ అని కవిత కామెంట్ చేశారు. మహిళా రిజర్వేషన్ల కోసం గతంలో పోరాటం చేసినట్లుగానే.. ఇకపై బీసీల కోసం పోరాటం చేస్తామని ఆమె వెల్లడించారు.