BRS MLAs : ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం, నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాదరావును బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(BRS MLAs) ఇవాళ ఉదయం కలిశారు. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వారు కోరారు. ఇప్పటికే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న విషయాన్ని వారు గుర్తు చేశారు. నియోజకవర్గాల్లో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు సంబంధించి ప్రొటోకాల్‌ను సక్రమంగా పాటించడం లేదని, ప్రొటోకాల్ ను పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. ఈమేరకు స్పీకర్‌కు(Speaker Gaddam Prasada Rao) వినతిపత్రాన్ని సమర్పించారు.
పార్టీ ఫిరాయింపులు మరియు ప్రోటోకాల్ ఉల్లంఘనలపై స్పీకర్ ను కలిసేందుకు అసెంబ్లీలోని బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో సిద్దంగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. pic.twitter.com/LmrPQU7yev
— BRS Party (@BRSparty) July 16, 2024
We’re now on WhatsApp. Click to Join
స్పీకర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో కేటీఆర్, హరీష్ రావు, సునీత లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, చింత ప్రభాకర్, మాణిక్ రావు, మాగంటి గోపీనాథ్, కేపీ వివేకానంద, పద్మారావు గౌడ్, కాలేరు వెంకటేష్, మాధవరం కృష్ణారావు, మర్రి రాజశేఖర్ రెడ్డి, డాక్టర్ సంజయ్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, మధుసూదనా చారి, వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. మరో 14 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీ నేతలతో పాటు స్పీకర్‌ను కలిసేందుకు రాలేదు. దీంతో వారు బీఆర్ఎస్‌తోనే ఉన్నారా ? పక్కచూపులు చూస్తున్నారా ? అనే సందేహాలు అలుముకున్నాయి.
Also Read :India vs Sri Lanka: బీసీసీఐని విశ్రాంతి కోరిన మరో సినీయర్ ఆటగాడు.. ఎవరంటే..?
బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల బలం 28కి తగ్గిపోయింది. తాజాగా స్పీకర్‌తో సమావేశానికి గైర్హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల జాబితాలో.. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, అలంపూర్ ఎమ్మెల్యే విజేయుడు, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. వీరిలో ఆలంపూర్ ఎమ్మెల్యే విజేయుడు కాంగ్రెస్ లో చేరుతారనే టాక్ వినిపిస్తోంది. మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు ఈ మీటింగ్ రాలేదన్నది తెలియాల్సి ఉంది. ఎమ్మెల్యేలంతా ఈ రోజు స్పీకర్ ను కలవడానికి రావాలని బీఆర్ఎస్ పార్టీ ముందుగానే ఆదేశాలు ఇచ్చింది. అయినా ఇంతపెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదన్న అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.