Maganti Gopinath: మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) తెలుగు రాష్ట్రాల్లో కీలక రాజకీయ నేతగా పేరుపొందారు. టీడీపీతో తన రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆయన ఆ తర్వాత అప్పటి టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్)లో చేరి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గోపినాథ్ సినిమా నిర్మాత, రాజకీయ నాయకుడు. ఆయన జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు.
అనారోగ్య సమస్యలతో కన్నుమూత
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకుడు మాగంటి గోపీనాథ్ (62) ఆదివారం (జూన్ 8) ఉదయం 5:45 గంటలకు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో గుండెపోటు కారణంగా కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, జూన్ 5న గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.
Also Read: Maganti Gopinath : బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత
మాగంటి గోపీనాథ్ 1983లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ)తో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి.. 2014, 2018, 2023 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా.. 1987, 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హుడా) డైరెక్టర్‌గా, 1988 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పని చేశారు.
2018లో టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) తరపున 16,004 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి పి. విష్ణువర్ధన్ రెడ్డిపై గెలుపొందారు. 1985లో హైదరాబాద్ నగర తెలుగు యువత అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. 2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన తర్వాత జరిగిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా బీఆర్ఎస్‌లో చేరారు. అంతేకాకుండా ఆయన బీఆర్ఎస్ తరపున 2022లో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగాను పనిచేశారు. గోపినాథ్‌కు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ప్రముఖులు సంతాపం
ఆయన మరణం పార్టీకి తీరని లోటని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, తదితరులు ఆయన మరణానికి సంతాపం తెలిపారు.