బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు, ప్రభుత్వ ఆస్తులపై దాడులకు పిలుపునిచ్చారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రోహిత్ ముదిరాజ్ సమర్పించిన వీడియో ఫిర్యాదు ఆధారంగా ఈ చర్యలు చేపట్టారు. మే 26న బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో బాలక సుమన్ చేసిన ప్రసంగం వివాదానికి దారితీసింది. ఆ వీడియోలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర స్థాయి ఆందోళనలు చేపట్టాలని, పార్టీ నాయకులు ముందుండి ఉద్యమాలకు నాయకత్వం వహించాలని పిలుపునిచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆయన వ్యాఖ్యలు ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉండటంతో పాటు రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశముందనే ఫిర్యాదులు రావడంతో కేసు నమోదు చేశారు.
బాల్కా సుమన్‌పై పలు సెక్షన్లతో పాటు ప్రజా ఆస్తుల నష్ట నివారణ చట్టంలోని నిబంధనల కింద కేసులు నమోదు చేశారు. నేరపూరిత బెదిరింపులు, ప్రజా అశాంతికి దారితీసే ప్రకటనలు, నేరానికి ప్రేరేపించడం, కుట్ర తదితర ఆరోపణలు ఆయనపై నమోదు చేసిన కేసుల్లో ఉన్నాయి. సింగరేణి ప్రాంతంలో రైతులు, కార్మికులు పెద్ద ఎత్తున నిరసనలకు ముందుకు రావడం లేదని వ్యాఖ్యానించిన బాల్కా సుమన్, బీఆర్ఎస్ నాయకులే ఉద్యమాలకు నాయకత్వం వహించాలని పిలుపునిచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలే కేసు నమోదుకు ప్రధాన కారణంగా మారాయి. బాల్కా సుమన్‌ను అరెస్టు చేసిన పోలీసులు ఆయనను కోర్టులో హాజరుపరచేందుకు చర్యలు చేపట్టారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
