Defection MLAs : హైదరాబాద్‌లోని ఎంసీహెచ్ఆర్‌డీలో ఏర్పాటుచేసిన కాంగ్రెస్ శాసనసభా పక్ష (సీఎల్పీ) సమావేశానికి రావాలంటూ పది మంది బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కూడా ఆహ్వానం వెళ్లింది. అయితే వారంతా గైర్హాజరయ్యారు. న్యాయపరమైన చిక్కులు ఎదురు కాకూడదనే ఉద్దేశంతోనే ఫిరాయింపు ఎమ్మెల్యేలు సీఎల్పీ భేటీకి దూరంగా ఉండిపోయారని తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది.
Also Read :Maha Kumbh: సనాతన ధర్మంలోకి 200 మంది ఫారినర్లు.. మహాకుంభ మేళాలో ఆధ్యాత్మిక శోభ
అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇటీవలే 10 మంది బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు(Defection MLAs) తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులు నోటీసులు జారీ చేశారు. పార్టీ మార్పుపై లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని వారిని కోరారు. నోటీసులు అందుకున్న వారిలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్(ఖైరతాబాద్), అరికెపూడి గాంధీ( శేరిలింగంపల్లి), గూడెం మహిపాల్ రెడ్డి( పటాన్ చెరు), ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రనగర్), కడియ శ్రీహరి(స్టేషన్ ఘన్ పూర్), తెల్లం వెంకటరావు(భద్రాచలం), బండ్ల కృష్ణమోహన్ రెడ్డి( గద్వాల), పోచారం శ్రీనివాస్ రెడ్డి (బాన్సువాడ), కాలె యాదయ్య(చేవెళ్ల), సంజయకుమార్( జగిత్యాల) ఉన్నారు. వీరంతా సమాధానం ఇచ్చేందుకు గడువు కోరారు.
Also Read :Avuku ITI : అక్కడ ఐటీఐ విద్యార్థులంతా జైలుకే.. ఎందుకు ?
తదుపరిగా ఏం చేస్తారంటే..
బుధవారం రోజు మాజీమంత్రి దానం నాగేందర్ నివాసంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. తమకు అందిన నోటీసులకు సంబంధించి అసెంబ్లీ సెక్రటరీకి, సుప్రీంకోర్టుకు ఎలాంటి సమాధానం ఇవ్వాలనే దానిపై చర్చించారు. ఈ భేటీలో సీఎం రేవంత్ సన్నిహితుడు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. కోర్టును ఆశ్రయిస్తే మంచిదనే అభిప్రాయానికి ఫిరాయింపు ఎమ్మెల్యేలు వచ్చినట్లు తెలిసింది. వారంతా త్వరలోనే ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించి, న్యాయ నిపుణులతో భేటీ అవుతారని సమాచారం. కాగా, ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఫిబ్రవరి 10న తదుపరి విచారణ జరపనుంది.