BJP Telangana : తెలంగాణ బీజేపీలో కొత్త రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై చర్చలు ముమ్మరంగా సాగుతున్న వేళ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పదవులు బీజేపీలో అంతగా ముఖ్యమైనవి కావని, కార్యకర్తలే నిజమైన నాయకులని స్పష్టం చేశారు. ఎవరు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా ఫర్వాలేదు. ఐక్యతే మన బలం. అన్ని స్థాయిల్లోనూ అందరూ కలిసికట్టుగా పని చేయాలి అని ఆయన పేర్కొన్నారు. ఇటీవల గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో కిషన్ రెడ్డి వ్యాఖ్యలు కొత్త ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. బీజేపీలో అంతర్గత చర్చలు, విభేదాలపై ఆయన సమాధానం ఇస్తూ, రామచందర్ రావు నేతృత్వంలో పార్టీ శ్రేణులంతా ఏకతాటిపై పనిచేయాలని సూచించారు.
Read Also: Baba Ramdev : సహజంగానే మనిషి ఆయుష్షు 150 నుంచి 200 ఏళ్లు: బాబా రాందేవ్ కీలక వ్యాఖ్యలు
ముఖ్యంగా, పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలి అని పిలుపునిచ్చారు. మంగళవారం మన్నెగూడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ఒకప్పుడు మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టినవారు బీఆర్‌ఎస్ నేతలు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది అని ధ్వజమెత్తారు. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను కుటుంబ పాలన, అవినీతి పాలనకు ప్రతీకలుగా కిషన్ రెడ్డి అభివర్ణించారు. ఇరు పార్టీలు రాష్ట్రాన్ని దోచుకున్నాయి. ప్రజలకు అసలు అభివృద్ధి కనిపించలేదని ఆయన ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏమీ చేయడం లేదన్న విమర్శలను తిప్పికొడుతూ, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలన్నింటికీ కేంద్ర సహకారమే ప్రధానంగా ఉన్నదని ఆయన స్పష్టం చేశారు. మిషన్ భగీరథ, రోడ్ల విస్తరణ, ఐటీ రంగ ప్రోత్సాహం ఇవన్నీ కేంద్రం మద్దతుతోనే సాధ్యమయ్యాయి. విమర్శకులు ఈ వాస్తవాన్ని గుర్తించాలి అని అన్నారు. రాష్ట్రంలో బీజేపీయే కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు ప్రత్యామ్నాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజల్లో పార్టీపై నమ్మకం పెరుగుతోంది. రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అని విశ్వాసంతో చెప్పారు. ఈ నేపథ్యంలో బీజేపీ అంతర్గతంగా ఐక్యతతో ముందుకు సాగితేనే, పార్టీ విజయానికి మార్గం సుగమమవుతుందని ఆయన పునరుద్ఘాటించారు. కొత్త నాయకత్వంపై వచ్చే ఏ నిర్ణయం అయినా సమిష్టిగా స్వీకరించి, పార్టీ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ఉంచాలని కార్యకర్తలకు సూచించారు.
Read Also: CM Chandrababu : పింఛన్ల కోసమే నెలకు రూ.2,750 కోట్లు ఖర్చు: సీఎం చంద్రబాబు