Site icon HashtagU Telugu

R Krishnaiah : ఆర్ కృష్ణయ్యను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీ

R Krishnaiah Bjp Rajya Sabha Candidate Telangana

R Krishnaiah : వైఎస్సార్ సీపీ మాజీ రాజ్యసభ ఎంపీ, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యకు కీలక అవకాశం దక్కనుంది. త్వరలో జరగనున్న రాజ్యసభ ఎంపీల ఉప ఎన్నిక కోసం ఆయనను తమ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ కోటా నుంచి ఆర్.కృష్ణయ్యను రాజ్యసభకు పంపుతామని అధికారికంగా  వెల్లడించింది.  గతంలో వైఎస్సార్ సీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కృష్ణయ్య తన పదవీకాలం మరో నాలుగేళ్లు మిగిలి ఉండగానే ఈ ఏడాది సెప్టెంబ‌రులో రాజీనామా చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఓటమి నేపథ్యంలో  ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు, స్కాలర్ షిప్‌లపై ఆర్.కృష్ణయ్య ఉద్యమం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనను మళ్లీ రాజ్యసభకు ఎంపీగా పంపేందుకు బీజేపీ(R Krishnaiah) రెడీ అయ్యింది. దీన్నిబట్టి బీజేపీలో ఆర్.కృష్ణయ్య చేరిక ఇక లాంఛనమే.

Also Read :Judge Comments : ‘‘ఇది హిందుస్తాన్.. మెజారిటీ ప్రజల ప్రకారమే దేశం నడుస్తుంది’’ : హైకోర్టు జడ్జి జస్టిస్ శేఖర్‌కుమార్ యాదవ్

రాజ్యసభ ఎంపీల బైపోల్స్ కోసం ముగ్గురు అభ్యర్థులతో బీజేపీ ఒక లిస్టును విడుదల చేసింది. అందులో  ఆర్.కృష్ణయ్యతో పాటు హర్యానా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజిత్ కుమార్ పేర్లు ఉన్నాయి. రాజ్యసభ బైపోల్స్ కోసం నామినేషన్ల దాఖలుకు తుదిగడువు  రేపటి (మంగళవారం)తో ముగియనుంది. ఎన్డీయే కూటమి తరఫున మంగళవారం రోజు ఈ ముగ్గురు నేతలు నామినేషన్లు వేస్తారు. ఆయన ఇప్పటికే హైదరాబాద్‌ నుంచి విజయవాడకు బయల్దేరారని తెలిసింది.  రేపు (మంగళవారం) ఉదయం 11 గంటలకు ఆర్ కృష్ణయ్య నామినేషన్‌ పత్రాలు సమర్పిస్తారు. మ‌ళ్లీ రాజ్య‌స‌భ ఎంపీ ప‌ద‌వి దక్కడంతో ఆర్ కృష్ణ‌య్య‌కు బీసీ సంఘాల నాయ‌కులు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.  కాగా, 2014 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో హైదరాబాద్‌లోని ఎల్బీ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఆర్.కృష్ణయ్య గెలిచారు. అనేక బీసీ ఉద్య‌మాల‌కు ఆయన నాయ‌క‌త్వం వ‌హించారు. బీసీల రిజ‌ర్వేష‌న్లు, వారి అభివృద్ధి కోసం పోరాటాలు నిర్వ‌హించారు.

Also Read :APCRDA Building Design: ఏపీ సీఆర్డీఏ భవనం డిజైన్‌పై ప్రజల ఓటింగ్ గడువు పొడగింపు