Telangana Municipal Election Results 2026 : తెలంగాణ పురపాలక ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (BRS) ప్రస్థానం మున్సిపాలిటీల వద్దే ఆగిపోయినట్లు కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 7 ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్లలో (కరీంనగర్, నిజామాబాద్, రామగుండం, మహబూబ్ నగర్, నల్గొండ, మంచిర్యాల, కొత్తగూడెం) బిఆర్ఎస్ పార్టీ తీవ్ర పరాభవాన్ని ఎదుర్కొంది. ఈ 7 కార్పొరేషన్ల పరిధిలోని మొత్తం 414 డివిజన్లలో ఆ పార్టీ కేవలం 63 చోట్ల మాత్రమే విజయం సాధించగలిగింది. మున్సిపాలిటీల్లో సుమారు 13 చోట్ల జెండా ఎగురవేసినా, పట్టణ ప్రాంత ఓటర్లు ముఖ్యంగా కార్పొరేషన్ల పరిధిలో ‘కారు’కు బ్రేకులు వేయడం గమనార్హం.
ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని కీలక నగరాల్లో బిఆర్ఎస్ పరిస్థితి దయనీయంగా మారింది. నిజామాబాద్ (NZB) కార్పొరేషన్‌లో మొత్తం 60 డివిజన్లు ఉండగా, గతంలో బలంగా ఉన్న బిఆర్ఎస్ ఈసారి కేవలం ఒక్కటంటే ఒక్క స్థానానికే పరిమితమైంది. అటు కరీంనగర్, నిజామాబాద్, కొత్తగూడెం వంటి ప్రధాన నగరాల్లో కూడా బిఆర్ఎస్ మూడవ స్థానానికి పడిపోయింది. పదేళ్ల పాటు అధికారాన్ని అనుభవించిన ప్రాంతాల్లో కూడా ఈ స్థాయిలో ఓటర్లు తిరస్కరించడం ఆ పార్టీ నాయకత్వానికి మింగుడుపడని అంశంగా మారింది. పట్టణ మౌలిక సదుపాయాలు మరియు అభివృద్ధి విషయంలో ప్రజలు ప్రభుత్వంపై పెంచుకున్న అంచనాలే ఈ ఫలితాలకు ప్రతిబింబమని తెలుస్తోంది.
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో కొంత మేర పర్వాలేదనిపించిన బిఆర్ఎస్, నగరాల్లో మాత్రం పూర్తిగా చతికిలపడింది. దీనిని బట్టి గ్రామీణ ఓటర్లకు, నగర ఓటర్లకు మధ్య స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది. కార్పొరేషన్లలో కాంగ్రెస్ తన దూకుడును ప్రదర్శించి నాలుగు చోట్ల స్పష్టమైన అధికారాన్ని దక్కించుకోగా, కరీంనగర్ లాంటి చోట్ల బీజేపీ తన సత్తా చాటింది. కానీ, అన్ని కార్పొరేషన్లలో కలిపి కనీసం 100 డివిజన్లు కూడా గెలవలేకపోవడం బిఆర్ఎస్ పతనానికి నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. రాబోయే కాలంలో పట్టణ ఓటర్లను మళ్ళీ ఆకర్షించాలంటే పార్టీ సిద్ధాంతాలను, వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
