YouTuber Anvesh: ట్రావెల్ వ్లాగర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అన్వేష్ ఇటీవల కాలంలో తన వీడియోల్లో అమర్యాదకరమైన భాషను వాడుతున్నాడని, సామాజిక విలువలకు విఘాతం కలిగిస్తున్నాడనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి లేదా సమాజంలో అసహనం కలిగించేలా ఆయన ప్రవర్తన ఉందన్న ఆరోపణలపై పోలీసులు దృష్టి సారించారు.
పోలీసుల యాక్షన్.. లుకౌట్ నోటీసులు
అన్వేష్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్లు సమాచారం అందడంతో అతను దేశంలోకి ప్రవేశించినా లేదా విదేశాలకు వెళ్లాలన్నా వెంటనే గుర్తించేలా పోలీసులు లుకౌట్ సర్క్యులర్ (LOC) జారీ చేశారు. అసభ్యకర పదజాలంతో వీడియోలు రూపొందించిన విషయంలో ఈ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. అన్వేష్‌కు సంబంధించిన డిజిటల్ అకౌంట్లను శాశ్వతంగా నిలిపివేయాలని పోలీసులు యోచిస్తున్నారు.
సోషల్ మీడియా సంస్థలకు లేఖలు
అన్వేష్ అరాచకాలకు అడ్డుకట్ట వేయడానికి పోలీసులు సాంకేతిక పరమైన చర్యలు చేపట్టారు. ఇప్పటికే అన్వేష్‌కు చెందిన ఒక ప్రధాన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను సదరు సంస్థ బ్లాక్ చేసింది. తనకు ఇంకా రెండు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు, రెండు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయని అన్వేష్ సవాల్ విసిరిన నేపథ్యంలో.. వాటిని కూడా తొలగించాలని కోరుతూ పోలీసులు మెటా, గూగుల్ సంస్థలకు అధికారికంగా లేఖలు రాయనున్నారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వాడకపోతే చట్టపరమైన పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయనేదానికి ఈ కేసు ఒక ఉదాహరణ.
అన్వేష్ స్పందన
తన అకౌంట్ బ్లాక్ అయినప్పటికీ తనకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని, తనను ఎవరూ ఆపలేరని అన్వేష్ ఇటీవల ఒక వీడియోలో పేర్కొన్నాడు. అయితే చట్టం తన పని తాను చేసుకుపోతుండటంతో ఇప్పుడు ఆయన చిక్కుల్లో పడ్డట్లయింది.
