Bhu Bharati : రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని అమలు చేసే దిశగా సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం మార్గదర్శకాల రూపకల్పనలో అధికార యంత్రాంగం నిమగ్నమై ఉన్నది. ఈ చట్టంలోని మొత్తం 19 అంశాల్లో తొలుత కొన్ని ముఖ్యమైన భాగాలను అమలు చేయాలని నిర్ణయించగా, మానవ వనరులు, నిధుల కొరత వంటి అంశాల కారణంగా మరికొన్ని అంశాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సమాచారం. భూ రికార్డుల ప్రక్షాళన, డిజిటలైజేషన్ వంటి కీలకమైన అంశాలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్వోఆర్-2025 (Records of Rights-2025)లో భాగంగా ఉన్నాయని, వీటి కోసం కేంద్రం నుండి ఎక్కువ నిధులు అందుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాల్సిన అవసరముందని నిపుణులు సూచిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, ప్రాజెక్ట్‌కు నిధుల మంజూరు విషయంలో కేంద్రాన్ని ఒత్తిడికి గురిచేయాలని భావిస్తున్నారు.
భూభారతి చట్టంతో పాటు కేంద్రం ప్రవేశపెట్టిన స్వమిత్వ పథకం (Survey of Villages with Improved Technology in Village Areas) ద్వారా గ్రామీణ భూ రికార్డుల ఆధునీకరణ జరుగుతోంది. డ్రోన్ టెక్నాలజీ, కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్ (CORS) వంటి ఆధునిక సాంకేతికతల ద్వారా ల్యాండ్ పార్శిల్ మ్యాపింగ్‌ను చేపడుతున్నారు. ఈ పథకాన్ని 2020లో ప్రారంభించి, దశల వారీగా అమలు చేస్తున్నారు.
SLBC Tunnel: ఏమిటీ ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ? 20 ఏళ్లుగా ఎందుకు నిర్మిస్తున్నారు ?
స్వమిత్వ వల్ల:
- ఆస్తుల భద్రత పెరుగుతుంది
- ప్రభుత్వ రెవెన్యూ వసూలు సమర్థవంతంగా మారుతుంది
- యజమానులకు హక్కుల గ్యారంటీ లభిస్తుంది
- గ్రామ పంచాయతీల అభివృద్ధికి సహాయపడుతుంది
ప్రస్తుతం హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈ పథకం అమలవుతుండగా, త్వరలోనే మిగతా రాష్ట్రాల్లోనూ విస్తరించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని మరింత బలోపేతం చేస్తూ, భూ రికార్డుల చక్కదిద్దుకు ప్రత్యేక రికార్డులను నిర్వహించాలని నిర్ణయించింది.
ఆర్వోఆర్-2025లో భాగంగా ప్రతి ల్యాండ్ పార్శిల్‌కు ప్రత్యేక నంబర్ ఇవ్వాలని, అలాగే ఆస్తులకు భూధార్ కార్డు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం భూ రికార్డులపై చాలా అనిశ్చితి నెలకొనగా, వీటిని క్లియర్ చేయడానికి రెండు దశల్లో భూధార్ నంబర్ విధానం అమలవుతుంది:
తాత్కాలిక భూధార్ నంబర్ – ప్రస్తుత భూ రికార్డుల ఆధారంగా ప్రాథమిక నంబర్ కేటాయిస్తారు.
స్థిర భూధార్ నంబర్ – సమగ్ర భూ సర్వే అనంతరం, ఖచ్చితమైన వివరాలతో శాశ్వత నంబర్ కేటాయిస్తారు.
ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూనిక్ ల్యాండ్ పార్శిల్ ఐడెంటిటీ నంబర్ (ULPIN) పథకానికి అనుసంధానమవుతుంది. ప్రతి భూ యజమానికి యూనిక్ నంబర్ కేటాయించడం ద్వారా భూ సంబంధిత వివాదాలు, అక్రమ యాజమాన్య మార్పులను నిరోధించేందుకు అవకాశం ఉంటుంది.
పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం
భూభారతి చట్టంలో పేద రైతులకు ఉచిత న్యాయ సేవలను అందించేందుకు కూడా ప్రణాళిక రూపొందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (NALSA) ద్వారా లీగల్ ఎయిడ్ ప్రోగ్రాములు అమలు చేయాలనే యోచన ఉంది. ఇందుకు.. గ్రామ న్యాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలి.. పారాలీగల్ అసిస్టెంట్లను వినియోగించుకోవాలి.. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మాదిరిగా వ్యవస్థను నిర్మించాలి.. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పారాలీగల్ వ్యవస్థ అమలైన నేపథ్యంలో, ఇప్పటికే అనుభవం ఉన్న పారాలీగల్ అసిస్టెంట్లు, సర్వేయర్లను ఉపయోగించుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు.
భూభారతి చట్టంలో ఉన్న అన్ని అంశాలను ఒకేసారి అమలు చేయడం సాధ్యపడదు. ప్రత్యేకించి, సేల్ డీడ్, ఇతర లావాదేవీలకు సర్వే మ్యాప్ తప్పనిసరి అనే నిబంధన అమలుకు ముందుగా వ్యవస్థను సిద్ధం చేయాలి. అలాగే ప్రతి మండలంలో సర్వే వ్యవస్థ ఏర్పాటు చేయాలి.. భూధార్ నంబర్ విధానం అమలు చేయాలి
సక్సెషన్ ప్రక్రియకు విచారణ వ్యవస్థ రూపొందించాలి.. ఈ మార్గదర్శకాల కోసం ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పుడున్న చట్టంలోని సాధ్యమైన కొన్ని విభాగాలను ముందుగా అమలు చేసి, మిగతావాటికి మెరుగైన ప్రణాళిక సిద్ధం చేసిన తర్వాత పూర్తి స్థాయిలో అమలు చేయాలని భావిస్తున్నారు.
Chiranjeevi : ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ లో మెగాస్టార్ సందడి.. తిలక్ వర్మ, అభిషేక్ శర్మలతో కలిసి..