Phone Tapping Case : తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష నేతలు టార్గెట్‌గా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు సుప్రీంకోర్టు ఇవాళ బెయిల్‌ను మంజూరు చేసింది. ఆయన గత 10 నెలలుగా జైలులోనే ఉన్నారు. తిరుపతన్న బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును పలుమార్లు ఆశ్రయించారు. అయితే ఆయనకు బెయిల్ మంజూరు కాలేదు. దీంతో నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తిరుపతన్న బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ పలుమార్లు వాయిదా పడింది. అయితే ఎట్టకేలకు ఇవాళ విచారణ జరగడంతో, ఆయనకు బెయిల్ మంజూరైంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్రలతో కూడిన ధర్మాసనం తిరుపతన్నకు బెయిల్‌ను(Phone Tapping Case) మంజూరు చేసింది.
Also Read :GB Syndrome Symptoms : జీబీఎస్ ‘మహా’ కలకలం.. ఏమిటీ వ్యాధి ? లక్షణాలు ఎలా ఉంటాయ్ ?
వాదనలు ఇలా జరిగాయ్..
తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, తిరుపతన్న తరఫున న్యాయవాది సిద్ధార్థ దవే వాదనలు వినిపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తునకు ఇంకా ఎంత టైం పడుతుందని విచారణ సందర్భంగా సిద్ధార్థ లూథ్రాను సుప్రీంకోర్టు బెంచ్ ప్రశ్నించింది. ‘‘ఇంకో నాలుగు నెలల టైం పడుతుంది’’ అని న్యాయవాది సిద్ధార్థ లూథ్రా బదులిచ్చారు. ఈ సమాధానం విన్న సుప్రీంకోర్టు బెంచ్ అసహనం వ్యక్తం చేసింది. కేసు విచారణకు ఇంకెంత టైం కావాలంటూ మండిపడింది. ‘‘విచారణ పేరుతో నిందితుడు తిరుపతన్నను గత 10 నెలలుగా జైలులో ఉంచారు. అతడికి ఇప్పటికైనా బెయిల్ మంజూరు చేయాలి’’ అని కోర్టును తిరుపతన్న తరఫు న్యాయవాది కోరారు. ఈ వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు ధర్మాసనం తిరుపతన్నకు బెయిల్ ఇచ్చింది. కేసు విచారణకు సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయొద్దని తిరుపతన్నకు నిర్దేశించింది.
Also Read :Weekly Horoscope: జనవరి 27 టు ఫిబ్రవరి 2 రాశిఫలాలు.. ఆ రాశుల వారి జీవితంలో కుదుపులు
బీఆర్ఎస్ హయాంలో రాజకీయ నేతల ఒత్తిడితో కొందరు విపక్ష నేతల ఫోన్లను పోలీసు అధికారులు ట్యాప్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఫోన్ ట్యాపింగ్ రికార్డులను ధ్వంసం చేశారనే అభియోగాలతో కేసులు నమోదు చేశారు. ఈ కేసులో అడిషనల్ ఎస్పీ తిరుపతన్న కీలక నిందితుడిగా ఉన్నారు.
ఇంకా జైలులోనే రాధాకిషన్‌రావు
ఈ కేసులోని మరో కీలక నిందితుడు టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు జైలులోనే ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని లీడ్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న టాస్క్‌ఫోర్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆయనను రప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇంటర్‌పోల్ ద్వారా ప్రయత్నాలు చేస్తోంది.