Bjp Mp Godam Nagesh ఆదిలాబాద్ జిల్లా ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతుంది. జిల్లాలో కొత్తగా ఎయిర్‌పోర్టు కానుంది. ఈ మేరకు ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు మాస్టర్ ప్లాన్‌ను ఎంపీ గోడం నగేష్ విడుదల చేశారు. త్వరలోనే భూసేకరణ పనులు ప్రారంభం అవుతాయని ఎంపీ వెల్లడించారు. ఈ ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తే జిల్లా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.
- ఆదిలాబాద్ కొత్త ఎయిర్‌పోర్టు
- మాస్టర్ ప్లాన్ విడుదల చేసిన ఎంపీ నగేష్
- త్వరలోనే భూసేకరణ పనులు ప్రారంభం
తెలంగాణలో ప్రస్తుతం శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో మరికొన్ని ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టు, కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్‌లలో కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టు భూసేకరణ పనులు మెుదలయ్యాయి. తాజాగా.. ఆదిలాబాద్ విమానాశ్రయంపై కూడా కీలక అప్డేట్ వచ్చింది.
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు మాస్టర్ ప్లాన్‌కు అనుమతి వచ్చిందని ఎంపీ గోడం నగేష్ వెల్లడించారు. త్వరలో భూసేకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి బుధవారం (ఫిబ్రవరి 18) తన క్యాంపు కార్యాలయంలో ఎయిర్‌పోర్టు మాస్టర్ ప్లాన్ ప్రతిని మీడియా ముందు విడుదల చేశారు. ఈ ప్రాంతంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు మరో 10 వేల ఎకరాల గుర్తింపునకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు రంగంలోకి దిగాక.. మాస్టర్ ప్లాన్‌లో కొంత మార్పులు కూడా జరిగే అవకాశం ఉందని చెప్పారు. జిల్లా అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వివరించారు. అనంతరం సోషల్ మీడియాలోనూ ఈ విషయాలను వెల్లడించారు.
ఆదిలాబాద్ విమానాశ్రయ మాస్టర్ ప్లాన్ ఆమోదం పొందింది. జిల్లా ప్రజలకు ఇది ఒక చారిత్రాత్మక మైలురాయి. దశాబ్దాలుగా ఈ ప్రాంతం ప్రజలు ఎయిర్ కనెక్టివిటీ కోసం ఎదురు చూస్తున్నారు. నేడు ఆ కల సాకారం కాబోతుంది. ఆదిలాబాద్ విమానాశ్రయ మాస్టర్ ప్లాన్‌ను ముందుకు తీసుకెళ్లాలనే ఆకాంక్ష నేడు కార్యరూపం దాల్చుతోంది. అధికారికంగా మాస్టర్ ప్లాన్ ఆమోదించారు. త్వరలోనే ఎయిర్‌పోర్టు నిర్మాణం పనులు ప్రారంభమవుతాయి. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అనేక రంగాల్లో ముందడుగు వేస్తోంది. మౌళిక సదుపాయాలకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. వాటి ఫలితమే ఈ ముందడుగు. స్థానిక ప్రజల దీర్ఘకాల డిమాండ్‌ను నిజం చేయటం కోసం నిరంతర కృషి చేసిన కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్‌లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విమానాశ్రయం మౌలిక సదుపాయాల ప్రాజెక్టు కంటే ఎక్కువ. ఇది ఆదిలాబాద్ జిల్లాకు ఒక మలుపు. మా జిల్లాను ప్రధాన నగరాలకు అనుసంధానిస్తుంది, స్థానిక వ్యాపారాలు, రైతులకు మద్దతు ఇస్తుంది, మా గిరిజన, అటవీ ప్రాంతాలకు పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుంది, కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తుంది. ఆదిలాబాద్ యువతకు ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది.’ అని గోడం నగేష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
