PV Narasimha Rao : తెలుగువాళ్లంతా గర్వించే గొప్ప నేత పీవీ నరసింహారావు . గతంలో మన దేశానికి ప్రధానమంత్రిగా సేవలు అందించే గొప్ప అవకాశం ఆయనకు లభించింది. తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు 83 ఏళ్ల వయసులో 2004 సంవత్సరం డిసెంబరు 23న కన్నుమూశారు. ఆయన ఈ లోకాన్ని భౌతికంగా వదిలిపెట్టి అప్పుడే 20 ఏళ్లు గడిచిపోయాయి. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఢిల్లీలోని అక్బర్ రోడ్ 24వ నంబరు బంగ్లాలో ఉండేది. తాజాగా బుధవారం రోజు కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్‌ను ఢిల్లీలోని ‘9A కోట్లా మార్గ్’లో ఉన్న నూతన భవనంలోకి మార్చారు. దీనికి ఇందిరా భవన్ అని పేరు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ పాత ఆఫీసులో మన పీవీ నరసింహారావు ఫొటో ఉండేది కాదు. అయితే కొత్తగా ఏర్పాటు చేసిన ఆఫీసులో పీవీ ఫొటోను(PV Narasimha Rao) ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ హెడ్ క్వార్టర్ ప్రారంభోత్సవం సందర్భంగా పార్టీకి చెందిన ఆరుగురు మాజీ ప్రధానమంత్రులు జవహర్‌లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నర్సింహా రావు, మన్మోహన్ సింగ్‌ల పాలనలో సాధించిన విజయాలు, సంస్కరణలపై ప్రత్యేక వీడియోను ప్రసారం చేశారు. దీనిపై తెలుగు ప్రజల్లో, నేతల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహించిన ఘనుడిగా, దేశ ఆర్థిక వ్యవస్థలో సంస్కరణల బాటను వేసిన ధీరుడిగా పీవీని భారతదేశ చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది.గత సంవత్సరం మాజీ ప్రధాని పీవీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని సైతం ప్రకటించింది.
Also Read :Space Docking : జయహో ఇస్రో.. జంట ఉపగ్రహాల స్పేస్ డాకింగ్ సక్సెస్
పీవీ ఫొటోలలో..
- మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు వెదురు కుర్చీపై కూర్చున్న ఒక బ్లాక్ అండ్ వైట్ ఫొటోను కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్‌లో ఏర్పాటు చేశారు.
- రాష్ట్రపతి భవన్‌లోకి దక్షిణ కొరియా అధ్యక్షుడు కిమ్ యంగ్ సామ్‌ను అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మతో పీవీ నర్సింహారావు స్వాగతిస్తున్న మరో ఫొటోను ఏర్పాటు చేశారు.
- దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హయాంలో పీవీ నర్సింహారావు దేశ రక్షణ మంత్రిగా వ్యవహరించారు. అప్పట్లో రాజీవ్‌గాంధీతో, పీవీ దిగిన ఫొటోను కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఇదే ఫొటోలో వారిద్దరితో పాటు యువకుడిగా ఉన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఉన్నారు.
Also Read :Sankranti Cockfights : 3 రోజుల్లో రూ.1,500 కోట్ల కోడిపందేలు.. ఎంతోమంది ‘నష్ట’కష్టాలు
కార్యాలయాల మార్పు ఎందుకు ?
కాంగ్రెస్ కొత్త హెడ్ క్వార్టర్‌లో పార్టీ ఆవిర్భావం నుంచి సేవలు అందించిన ప్రముఖ నాయకుల చారిత్రక విజయాలు, రచనలు, నిర్ణయాలను ఫొటోల ద్వారా ప్రదర్శించారు. ఇంతకుముందు వరకు కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ’24 అక్బర్ రోడ్’లోని బ్రిటీష్ కాలం నాటి ప్రభుత్వ బంగ్లాలో ఉండేది. అయితే ప్రభుత్వ బంగ్లాలలో రాజకీయ పార్టీల ఆఫీసులు ఉండకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు సొంతంగా భవనాలు నిర్మించుకున్నాయి.