Indravelli Martyrs : ఇంద్రవెల్లి ఘటనకు 44 ఏళ్లు.. తొలిసారి అధికారికంగా సంస్మరణ దినం

1981 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో(Indravelli Martyrs) జల్, జంగిల్, జమీన్ కోసం అడవి బిడ్డలు శాంతియుత సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

Published By: HashtagU Telugu Desk
Indravelli Incident Martyrs Commemoration Day Telangana Adilabad 2025

Indravelli Martyrs : ఇవాళ (ఏప్రిల్ 20) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినం. తొలిసారిగా ఈ దినాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి హోదాలో  ఇంద్రవెల్లి ఆమరవీరుల స్థూపం నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. కాంగ్రెస్ అధికారంలో రాగానే అమరవీరుల స్థూపాన్ని స్మృతి వనంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఇందుకు అనుగుణంగానే ఇంద్రవెల్లిలో స్మృతివనం ఏర్పాటుకు రూ.95 లక్షలను రాష్ట్ర సర్కారు ఖర్చు చేసింది. ఈ నిధులతో అమరవీరుల స్థూపం చుట్టూ ప్రహరీ గోడ,  సీసీ రోడ్డు నిర్మాణం, గెస్ట్ రూమ్, స్మృతివనం పనులు చేశారు. ఇంద్రవెల్లి  ఘటనలో అమరులైన 15 కుటుంబాలకు మోడల్ ఇందిరమ్మ ఇళ్లతో పాటు రూ.1.5 కోట్లతో ట్రైకార్ ద్వారా వివిధ రుణాలను మంత్రి సీతక్క చేతుల మీదుగా పంపిణీ చేశారు.

1981 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో ఏం జరిగింది ? 

1981 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో(Indravelli Martyrs) జల్, జంగిల్, జమీన్ కోసం అడవి బిడ్డలు శాంతియుత సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి పీపుల్స్‌ వార్‌ అనుబంధ రైతు కూలీ సంఘం ఈ మీటింగ్‌ను ఏర్పాటు చేసింది. తొలుత ఈ సమావేశానికి అనుమతించిన పోలీసులు, ఆ తర్వాత నిషేధాజ్ఞలను అమలు చేశారు. ఈ విషయం తెలియని ఆదివాసీలు ముందుకెళ్లారు.  దీంతో  పరిస్థితులు అదుపుతప్పాయి. ఈ  సమావేశంలో పాల్గొన్న  ఒకరు దాడి చేయడంతో ఓ పోలీసు నేలకొరిగారు. దీనికి ప్రతిగా పోలీసులు జరిపిన కాల్పుల్లో వందలాది మంది ఆదివాసీ బిడ్డలు అమరులయ్యారు. వందలాది మంది చనిపోయినా పోలీస్‌ యంత్రాగం 13 మందే మరణించినట్లు ప్రకటించింది. ఆ తర్వాత ఇక్కడ ఓ స్థూపాన్ని నిర్మించారు.

Also Read :Weekly Horoscope : వారఫలాలు.. ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 26 వరకు రాశిఫలాలను తెలుసుకోండి

ఉమ్మడి ఏపీ ఉండగా.. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండగా ఇంద్రవెల్లిలో సంస్మరణ కార్యక్రమం నిర్వహణపై బ్యాన్ ఉండేది. తెలంగాణ వచ్చాక గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఆంక్షలను సడలించింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిషేధాజ్ఞలను ఎత్తేసింది.అందుకే ఇవాళ ఆదివాసీలు ఇంద్రవెల్లిలో అధికారికంగా అమరవీరుల సంస్మరణ దినాన్ని నిర్వహించుకోనున్నారు.

  Last Updated: 20 Apr 2025, 01:05 PM IST