Police Vehicles Vs Challans : ట్రాఫిక్ ఛలాన్లు.. ఈ పేరు వినగానే సామాన్యులకు దడ మొదలవుతుంది. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించగానే భారీగా ఫైన్లు పడతాయి. వాటికి సంబంధించిన ఛలాన్లు జారీ అవుతాయి. వాటిని సకాలంలో కట్టకుంటే ఏళ్ల తరబడి పేరుకుపోతాయి. చివరకు వడ్డీతో సహా చెల్లించాల్సి వస్తుంది. ట్రాఫిక్ నియమాలను పాటించే వారికి ఈ భయాలు, ఆందోళనలు ఉండవు. అయితే ట్రాఫిక్ రూల్స్‌ను బ్రేక్ చేసే జాబితాలో సామాన్యులతో పాటు కొందరు పోలీసు సిబ్బంది కూడా ఉన్నారు. తాజాగా బయటికి వచ్చిన సమాచారాన్ని చూస్తే మీరు కూడా అవాక్కవుతారు.
Also Read :Nuclear Strike : పాక్ అణ్వాయుధం ప్రయోగిస్తే.. భారత్ ఇలా అడ్డుకుంటుంది
17,391 పెండింగ్ ఛలాన్లు
తెలంగాణలో పోలీసు సిబ్బంది, అధికారులు వినియోగించే వాహనాలు సాధారణంగా తెలంగాణ డీజీపీ(Police Vehicles Vs Challans) పేరిట రిజిస్టర్ అయి ఉంటాయి. డీజీపీ పేరిట ఉన్న పోలీసు వాహనాలపై ఎన్ని ట్రాఫిక్ ఛలాన్లు పెండింగ్‌లో ఉన్నాయో తెలుసా ? ప్రస్తుతం ఆ వెహికల్స్‌పై 17,391 పెండింగ్ ఛలాన్లు ఉన్నాయి. వీటి కింద దాదాపు రూ.68,67,885 చెల్లించాల్సి ఉంది. హైదరాబాద్‌కు చెందిన లోకేంద్రసింగ్ సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దరఖాస్తు చేయగా విస్మయపరిచే ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసు వాహనాలతో జరుగుతున్న ట్రాఫిక్ ఉల్లంఘనలు ఏ రేంజులో ఉన్నాయో దీన్నిబట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ట్రాఫిక్ రూల్స్ తమకు పట్టవన్నట్టుగా నిర్లక్ష్యంగా వ్యవహరించబట్టే ఇంతగా ఛలాన్లు జారీ అయ్యాయి. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తేనే.. భవిష్యత్తులో పోలీసు వాహనాల నిర్వహణ తీరు ట్రాఫిక్ రూల్స్‌కు అనుగుణంగా ఉంటుంది.
Also Read :Miss World 2025 : మిస్ వరల్డ్ 2025 పోటీలు.. ఏయే రోజు ఏమేం చేస్తారు ?
లోకేంద్రసింగ్ ట్వీట్.. ఛలాన్లపై నెటిజన్లు భగ్గు
ఈ అంశంపై లోకేంద్రసింగ్ మాట్లాడుతూ.. ‘‘ప్రజలకు పోలీసులు ఆదర్శంగా ఉండాలి. వాళ్లే పలుచోట్ల ట్రాఫిక్ రూల్స్‌ను దారుణంగా బ్రేక్ చేస్తుండటం బాధాకరం. ఈవివరాలను నేను సమాచార హక్కు చట్టం దరఖాస్తు ద్వారా సేకరించాను’’ అని చెప్పారు. ‘‘చట్టాన్ని అమలు చేసే అధికారుల పారదర్శకత, జవాబుదారీతనంపై నాకు నమ్మకం ఉంది. భవిష్యత్తులో పోలీసులు ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనలకు పాల్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈమేరకు వివరాలతో లోకేంద్రసింగ్ చేసిన ట్వీట్‌పై నెటిజన్లు స్పందించారు. ‘‘పెండింగ్ చలాన్ల చెల్లింపుపై సొంత డిపార్ట్మెంట్ వాళ్లు పెట్టిన డిస్కౌంట్ ఆఫర్లను వీళ్లు మర్చిపోయినట్టు కనిపిస్తున్నది. ఇలాంటి పెండింగ్ చలాన్ల వాహనాలను కూడా ప్రయాణం మధ్యలో ఆపి, మిగతా వారందరికీ చేస్తున్నట్లుగా, డబ్బు చెల్లించిన తర్వాతే ముందుకు అనుమతించాలి’’ అని ఓ నెటిజన్ కోరడం గమనార్హం. “అధికారులు చేసే ఉల్లంఘనలకు ఎంవీ చట్టం 2019లోని 210(బీ) ప్రకారం ఫైన్ విధించాలి. దీని ప్రకారం జరిమానాకు రెట్టింపు అంటే మొత్తం రూ 1.37 కోట్లు అవుతుంది’’ అని మరొక నెటిజన్ కామెంట్ పెట్టాడు.