Site icon HashtagU Telugu

Manoj Tiwary: ధోనీ వల్లే నా కెరీర్ నాశనమైంది… మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు

Manoj Tiwary

Manoj Tiwary

Manoj Tiwary: టీమిండియా మాజీ క్రికెటర్, బెంగాల్ క్రీడా శాఖ మంత్రి మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వల్లనే తన కెరీర్ నాశనమైందన్నాడు. 2011లో భారత్ తరఫున సెంచరీ చేసిన తర్వాత కూడా తనను తుది జట్టు నుంచి తప్పించారని గుర్తు చేసుకున్నాడు. తనకు వరుసగా అవకాశాలు ఇచ్చి ఉంటే కోహ్లీ, రోహిత్‌లా స్టార్ ప్లేయర్ అయ్యేవాడినని అభిప్రాయపడ్డాడు. సెంచరీ తర్వాత తనను తుది జట్టు నుంచి ఎందుకు తప్పించారనే విషయంపై ధోనీని నిలదీయాలనుకుంటున్నానని చెప్పాడు. ఈ సీజన్ రంజీ ట్రోఫీలో బెంగాల్ తరఫున బిహార్‌తో చివరి మ్యాచ్ ఆడిన మనోజ్ తివారీ.. అన్ని రకాల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

ధోనీతో పాటు బీసీసీఐ సెలక్టర్లపైనా మనోజ్ తివారీ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా ఆటగాళ్లను తీసుకోవడం సరికాదన్నాడు. దాంతో యువ ఆటగాళ్లంతా ఐపీఎల్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారనీ. ఇది రంజీ ట్రోఫీ ప్రాముఖ్యతను తగ్గిస్తోందని వ్యాఖ్యానించాడు. ఈ విషయాలపై ఏదైనా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే నిషేధం లేదా జరిమానాలు విధిస్తున్నారన్నాడు.

బీసీసీఐని ప్రస్తుతం రాజకీయ నాయకులు నడుపుతున్నారునీ , భవిష్యత్తులో కూడా బీసీసీఐ పాలన వ్యవహారాల్లో ఆటగాళ్లకు చోటు ఉండదన్నాడు. దేశవాళీ క్రికెట్‌లో 19 ఏళ్ల పాటు బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహించిన మనోజ్ తివారీ.. ఆ జట్టు తరఫున రంజీల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. భారత్ తరఫున 12 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇదిలా ఉంటే తివారీ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం భారత క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

Also Read: Byjus Vacate : అద్దె కట్టలేక అతిపెద్ద ఆఫీస్ ఖాళీ చేసిన ‘బైజూస్’