భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విషయంలో బీసీసీఐ తన సహనాన్ని కోల్పోయినట్లు కనిపిస్తోంది. 2026లో టీ20 ప్రపంచకప్‌ను గెలిపించినప్పటికీ, కెప్టెన్‌గా సూర్యకుమార్‌ను తప్పించి, అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు అప్పగించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బ్యాట్స్‌మెన్‌గా సూర్యకుమార్ యాదవ్ కొంతకాలంగా తీవ్ర ఫామ్ సమస్యలతో ఇబ్బంది పడుతుండటమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
2024 టీ20 ప్రపంచకప్ తర్వాత రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన సూర్యకుమార్ జట్టును విజయపథంలో నడిపించాడు. గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో సూర్య కెప్టెన్సీలో టీమిండియా 2026లో టీ20 వరల్డ్‌కప్ గెలిచి చరిత్ర సృష్టించింది. అయితే, కెప్టెన్‌గా జట్టు విజయవంతమైనప్పటికీ, బ్యాట్స్‌మెన్‌గా సూర్య పూర్తిగా విఫలమయ్యాడు. అతని పేలవ ఫామ్‌ను ఇకపై భరించలేమని, జట్టులో అతని స్థానాన్ని నిలబెట్టడం కోసం కెప్టెన్సీ నుంచి తప్పించడం సరైన మార్గమని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం.
సూర్య గణాంకాలు పరిశీలిస్తే, కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టక ముందు వరకు దాదాపు 170 స్ట్రైక్ రేట్‌తో విధ్వంసకర బ్యాట్స్‌మన్‌గా పేరుగాంచాడు. కానీ, కెప్టెన్ అయిన తర్వాత అతని బ్యాటింగ్ ప్రదర్శన పూర్తిగా పడిపోయింది. 2025 క్యాలెండర్ ఇయర్‌లో అతను ఒక్క అర్ధ సెంచరీ కూడా నమోదు చేయలేకపోయాడు. 2026 ప్రపంచకప్‌కు ముందు అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో 84 పరుగులతో ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించినా, అది తాత్కాలికమేనని తేలిపోయింది.
ముఖ్యంగా కీలకమైన నాకౌట్ మ్యాచ్‌లలో అతను విఫలమవడం జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది. 2026 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌తో జరిగిన వర్చువల్ క్వార్టర్ ఫైనల్‌లో 18, ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్‌లో 11, న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌లో డకౌట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో 2028 టీ20 ప్రపంచకప్, లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకుని జట్టును పునర్‌వ్యవస్థీకరించే ప్రణాళికలో భాగంగా బీసీసీఐ ఈ కఠిన నిర్ణయం వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సూర్య స్థానం కోసం శ్రేయస్ అయ్యర్ పోటీ పడుతుండటంతో త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
