Highest Paid Captains: ఐపీఎల్ 2026 ప్రారంభానికి కేవలం మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ మెగా టోర్నమెంట్ మార్చి 28 నుండి ప్రారంభం కానుంది. బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీ ప్రారంభానికి ముందు ఐపీఎల్ 2026లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న టాప్-3 కెప్టెన్లు ఎవరో, వారి కోసం ఫ్రాంచైజీలు ఎంత ఖర్చు చేస్తున్నాయో ఈ ప్రత్యేక కథనం ద్వారా తెలుసుకుందాం.
రుతురాజ్ గైక్వాడ్- శుభ్‌మన్ గిల్
ఐపీఎల్ 2026 అత్యధిక ధర కలిగిన కెప్టెన్ల జాబితాలో రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్ సంయుక్తంగా మూడవ స్థానంలో ఉన్నారు. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌ను రూ. 18 కోట్లకు ఆ జట్టు రిటైన్ చేసుకుంది. ఇక శుభ్‌మన్ గిల్ విషయానికి వస్తే గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్న గిల్‌కు కూడా ఐపీఎల్ 2026 కోసం రూ. 18 కోట్ల జీతాన్ని ఆ యాజమాన్యం చెల్లిస్తోంది. గిల్ సారథ్యంలో గుజరాత్ తన తొలి సీజన్లోనే ట్రోఫీని గెలుచుకున్న సంగతి తెలిసిందే.
Also Read: రేపు బ్యాంకులకు సెలవు ఉందా? లేదా?!
శ్రేయస్ అయ్యర్
పంజాబ్ కింగ్స్ (PBKS) కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. 2026 ఐపీఎల్ కోసం పంజాబ్ కింగ్స్ అయ్యర్‌కు రూ. 26.75 కోట్ల భారీ వేతనాన్ని చెల్లించనుంది. గతేడాది శ్రేయస్ కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ అద్భుత ప్రదర్శన చేసి టోర్నీ ఫైనల్‌కు చేరుకుంది. అందుకే పంజాబ్ యాజమాన్యం మరోసారి అయ్యర్‌పై నమ్మకం ఉంచి ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించి రిటైన్ చేసుకుంది.
రిషబ్ పంత్
ఐపీఎల్ 2026లో అత్యంత ఖరీదైన కెప్టెన్ మరెవరో కాదు భారత జట్టు డాషింగ్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్. లక్నో సూపర్ జెయింట్స్ పంత్‌కు రూ. 27 కోట్లు చెల్లిస్తోంది. గత సీజన్‌లో రిషబ్ సారథ్యంలో లక్నో జట్టు ఆశించిన స్థాయిలో రాణించనప్పటికీ పంత్ సామర్థ్యంపై నమ్మకంతో LSG రూ. 27 కోట్లతో కెప్టెన్‌గా తిరిగి అట్టిపెట్టుకుంది. రిషబ్ పంత్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన కెప్టెన్ మాత్రమే కాదు అత్యంత ఖరీదైన ఆటగాడు కూడా. ఐపీఎల్ వేలంలో లేదా రిటెన్షన్ ప్రక్రియలో ఇప్పటివరకు ఏ ఆటగాడికీ ఇంత భారీ మొత్తాన్ని ఏ ఫ్రాంచైజీ కూడా చెల్లించలేదు.
