Tilak Varma: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్, తెలుగు తేజం తిలక్ వర్మ చరిత్ర సృష్టించాడు. సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తిలక్ వర్మ తన కెరీర్‌లో మొట్టమొదటి ఐపీఎల్ సెంచరీని నమోదు చేశాడు. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి ఫోర్ కొట్టడం ద్వారా తిలక్ తన శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అంతకుముందు బంతికి సిక్సర్ బాది 97 పరుగులకు చేరుకున్న ఈ యువ బ్యాటర్ ఆ తర్వాతి బంతికే సెంచరీ మార్కును అందుకున్నాడు. కేవలం 45 బంతుల్లోనే 101 పరుగులు చేసి ముంబై ఇండియన్స్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.
జయసూర్య రికార్డు సమం.. రోహిత్‌ను వెనక్కి నెట్టి!
తిలక్ వర్మ తన ఇన్నింగ్స్‌లో 224కు పైగా స్ట్రైక్ రేట్‌తో 8 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్‌లో అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన రికార్డును తిలక్ సమం చేశాడు. 2008లో చెన్నై సూపర్ కింగ్స్‌పై సనత్ జయసూర్య 45 బంతుల్లోనే సెంచరీ సాధించగా ఇప్పుడు తిలక్ వర్మ ఆ ఫీట్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు పలువురు దిగ్గజాలను తిలక్ అధిగమించాడు. అంతేకాకుండా ఈ సీజన్‌లో సంజూ శాంసన్ (52 బంతుల్లో సెంచరీ) రికార్డును బద్దలు కొట్టి IPL 2026లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు.
Also Read: ఎంత నీరు తాగినా ఇంకా దాహమేస్తోందా?
22 బంతుల్లో 19.. ఆ తర్వాత విధ్వంసం!
తిలక్ ఇన్నింగ్స్ ఆరంభంలో చాలా నిదానంగా ఆడాడు. 14 ఓవర్లు ముగిసే సమయానికి అతను కేవలం 22 బంతుల్లో 19 పరుగులు మాత్రమే చేసి ఉన్నాడు. కానీ అక్కడి నుండి గేర్ మార్చిన తిలక్ తర్వాతి 23 బంతుల్లోనే ఏకంగా 82 పరుగులు పిండుకోవడం విశేషం. ఐదవ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ సాధించడం అతని ప్రతిభకు నిదర్శనం. ఇప్పటి వరకు 60 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన తిలక్ వర్మ, 1643 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 8 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 2022 నుండి అతను ముంబై ఇండియన్స్ తరపున కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
ముంబై భారీ విజయం
తిలక్ వర్మ వీరవిహారంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 199 పరుగులు చేసింది. అనంతరం 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ కేవలం 100 పరుగులకే కుప్పకూలింది. దీంతో ముంబై 99 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన అశ్విని కుమార్ 4 ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టి గుజరాత్‌ను దెబ్బతీశాడు. ఇక స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 3 ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి ఈ సీజన్‌లో తన మొదటి వికెట్‌ను అందుకున్నాడు.
