అండర్-19 వరల్డ్ కప్.. ఆరోసారి టైటిల్‌పై క‌న్నేసిన భారత్!

సెమీఫైనల్‌లో అఫ్గానిస్థాన్ నుంచి టీమ్ ఇండియాకు గట్టి పోటీ ఎదురైంది. కానీ ఆయుష్ మ్హ‌త్రే జట్టు తన సత్తా చాటుతూ ప్రత్యర్థిని మట్టికరిపించింది.

Published By: HashtagU Telugu Desk
Vaibhav Suryavanshi to make his debut in the second T20 between India and England today!

Vaibhav Suryavanshi to make his debut in the second T20 between India and England today!

ICC U19 World Cup 2026: భారత యువ జట్టు మరోసారి అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకుంది. కెప్టెన్ ఆయుష్ మ్హ‌త్రే, పేలుడు బ్యాటర్ వైభవ్ సూర్యవంశీలతో కూడిన ఈ టీమ్ ఈ ఏడాది టోర్నమెంట్ మొత్తంలో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఐసీసీ (ICC) ట్రోఫీ గెలవడంలో భారత్ హాట్ ఫేవరెట్ అనడంలో సందేహం లేదు. యూత్ ‘మెన్ ఇన్ బ్లూ’ ప్రయాణం ఇప్పటివరకు ఎలా సాగిందో తెలుసుకుందాం.

ఆరో టైటిల్ కోసం వేట

ఈ ఐసీసీ టోర్నమెంట్‌లో టీమ్ ఇండియా ఇప్పటివరకు అజేయంగా నిలిచింది. ఆత్మవిశ్వాసంతో ఉన్న ఆయుష్ మ్హ‌త్రే సేన ఫిబ్రవరి 6న హరారేలో ఇంగ్లాండ్‌తో జరిగే ఫైనల్ పోరులో ట్రోఫీ కోసం తలపడనుంది. ఈ ఈవెంట్ చరిత్రలో భారత్ అత్యంత విజయవంతమైన జట్టుగా ఉంది. ఇప్పటికే 5 సార్లు (2000, 2008, 2012, 2018, 2022) విజేతగా నిలిచింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా 4 సార్లు ట్రోఫీని గెలుచుకుంది. శుక్రవారం జరిగే మ్యాచ్‌లో రికార్డు స్థాయిలో ఆరోసారి టైటిల్ సాధించేందుకు భారత్ అడుగు వేయనుంది.

సెమీఫైనల్‌లో అద్భుత విజయం

సెమీఫైనల్‌లో అఫ్గానిస్థాన్ నుంచి టీమ్ ఇండియాకు గట్టి పోటీ ఎదురైంది. కానీ ఆయుష్ మ్హ‌త్రే జట్టు తన సత్తా చాటుతూ ప్రత్యర్థిని మట్టికరిపించింది. అఫ్గాన్ బ్యాటర్లు మొదట బ్యాటింగ్ చేసి 4 వికెట్ల నష్టానికి 310 పరుగుల భారీ స్కోరు సాధించారు. దీనికి సమాధానంగా ఆరోన్ జార్జ్ మెరుపు సెంచరీ (115) తో పాటు, వైభవ్ సూర్యవంశీ (68), ఆయుష్ మ్హ‌త్రే (62) అర్ధ సెంచరీల సాయంతో భారత్ టోర్నమెంట్ చరిత్రలోనే అతిపెద్ద రన్ ఛేజ్‌ను పూర్తి చేసింది. భారత్ కేవలం 41.1 ఓవర్లలోనే 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Also Read: యూపీఎస్సీ సీఎస్ఈ, ఐఎఫ్ఎస్ 2026 నోటిఫికేషన్ విడుదల..

టీమ్ ఇండియా ఆణిముత్యాలు

వైభవ్ సూర్యవంశీ: భారత్ ఓపెనర్ వైభవ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతను 6 మ్యాచ్‌ల్లో 3 హాఫ్ సెంచరీలతో 264 పరుగులు చేశాడు. అతని సగటు 44.00, స్ట్రైక్ రేట్ 147.48గా ఉంది. ఫైనల్‌లో అతను తన హాఫ్ సెంచరీని సెంచరీగా మారుస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.

అభిజ్ఞాన్ కుందు: వికెట్ కీపర్ బ్యాటర్ అభిజ్ఞాన్ భారత్‌కు మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు. ఈ లెఫ్ట్ హ్యాండర్ 6 మ్యాచ్‌ల్లో 2 హాఫ్ సెంచరీలతో 199 పరుగులు చేశాడు. ఇతని సగటు 66.33, స్ట్రైక్ రేట్ 82.23.

ఆయుష్ మ్హ‌త్రే: కెప్టెన్ ఆయుష్ తన ఆఫ్-బ్రేక్ బౌలింగ్‌తో రాణిస్తూ 6 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు పడగొట్టాడు. అయితే బ్యాటింగ్‌లో మెరుగుపడాల్సిన అవసరం ఉంది. టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తూ 6 మ్యాచ్‌ల్లో 161 పరుగులు మాత్రమే చేశాడు.

విహాన్ మల్హోత్రా: ఫైనల్‌లో ఆల్ రౌండర్ విహాన్ మల్హోత్రాపై అందరి దృష్టి ఉంది. అతను ఈ టోర్నీలో 210 పరుగులు చేశాడు. గ్రూప్ స్టేజ్‌లో జింబాబ్వేపై అజేయ సెంచరీ (109*) సాధించాడు.

ఆరోన్ జార్జ్: అఫ్గానిస్థాన్‌పై మ్యాచ్ విన్నింగ్ సెంచరీ (115) చేసి ఆరోన్ తన సత్తా చాటాడు. అతను 4 మ్యాచ్‌ల్లో 161 పరుగులు చేశాడు. అతను ఫామ్‌లోకి రావడం టీమ్ ఇండియాకు శుభపరిణామం.

హేనిల్ పటేల్: బౌలింగ్ విభాగంలో ఫాస్ట్ బౌలర్ హేనిల్ పటేల్ 6 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీశాడు. అతని ఎకానమీ రేట్ 4.19గా ఉంది. అలాగే ఆర్‌ఎస్ అంబరీష్, ఖిలాన్ పటేల్ తలో 8 వికెట్లు పడగొట్టారు.

  Last Updated: 05 Feb 2026, 12:48 PM IST