ఇంగ్లాండ్ అద్భుత విజయం.. సెమీఫైనల్‌కు హ్యారీ బ్రూక్ సేన, పాకిస్థాన్‌కు చుక్కెదురు!

లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ అద్వితీయమైన ఇన్నింగ్స్ ఆడాడు. పాకిస్థాన్ బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 51 బంతుల్లోనే 100 పరుగులు సాధించాడు.

Published By: HashtagU Telugu Desk
T20 World Cup 2026

T20 World Cup 2026

T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8లో ఇంగ్లాండ్ జట్టు తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ 2 వికెట్ల తేడాతో విజయం సాధించి ఇంగ్లాండ్ అదరగొట్టింది. ఈ ఓటమితో సూపర్-8లో పాకిస్థాన్ మొదటి ఓటమిని చవిచూసింది. ఇంగ్లీష్ టీమ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ మెరుపు సెంచరీతో జట్టును విజయతీరాలకు చేర్చాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ అద్భుతమైన అర్ధసెంచరీతో రాణించడంతో పాక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అనంతరం 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్, మరో 5 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో ఇంగ్లాండ్ సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.

Also Read: టీమిండియా కొంప‌ముంచిన ఆట‌గాళ్లు వీరేనా?!

బ్రూక్ కెరీర్‌లో తొలి టీ20 సెంచరీ

లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ అద్వితీయమైన ఇన్నింగ్స్ ఆడాడు. పాకిస్థాన్ బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 51 బంతుల్లోనే 100 పరుగులు సాధించాడు. 196 స్ట్రైక్ రేట్‌తో సాగిన ఈ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. హ్యారీ బ్రూక్ టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో ఇది మొదటి సెంచరీ. అతనికి తోడుగా విల్ జాక్స్ 23 బంతుల్లో 28 పరుగులు చేసి సహకరించాడు.

సాహిబ్‌జాదా ఫర్హాన్ పోరాటం వృథా

పాకిస్థాన్ బ్యాటర్లలో ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ ఒంటరి పోరాటం చేశాడు. 45 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 63 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. అయితే స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం మరోసారి విఫలమయ్యాడు. అతను 24 బంతుల్లో 25 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఫఖర్ జమాన్ 16 బంతుల్లో 25 పరుగులు చేయగా, చివరిలో షాదాబ్ ఖాన్ 11 బంతుల్లో 23 పరుగులు జోడించాడు. పాక్ జట్టులో ఏకంగా ఆరుగురు బ్యాటర్లు రెండంకెల స్కోరును కూడా అందుకోలేకపోవడం ఆ జట్టు పరాజయానికి ప్రధాన కారణమైంది.

  Last Updated: 24 Feb 2026, 11:00 PM IST