టీమిండియా ఖాతాలో మ‌రో ఓట‌మి!

148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఓపెనర్లు లారా వోల్వార్డ్, సునే లుస్ భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. లారా 34 బంతుల్లో 54 పరుగులు చేయగా, లుస్ 46 బంతుల్లో 57 పరుగులు సాధించింది.

Published By: HashtagU Telugu Desk
IND-W

IND-W

SA-W vs IND-W: భారత మహిళా క్రికెట్ జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికా మహిళా జట్టుతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది. సిరీస్‌లో భాగంగా జరిగిన మొదటి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించగా ఏప్రిల్ 19న జరిగిన రెండో టీ20లో కూడా దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. భారత్ తరపున షెఫాలీ వర్మ అర్ధ సెంచరీతో రాణించినప్పటికీ మిగిలిన బ్యాటర్లు ఎవరూ ప్రభావం చూపలేకపోయారు.

భారత్ స్కోరు 147 పరుగులు

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత మహిళా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ షెఫాలీ వర్మ 38 బంతుల్లో 57 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన 7 బంతుల్లో 12 పరుగులు చేయగా, జెమిమా రోడ్రిగ్స్ (2) నిరాశపరిచింది. తన అరంగేట్రం మ్యాచ్ ఆడుతున్న అనుష్క శర్మ 31 బంతుల్లో 28 పరుగులు చేసి ఫర్వాలేదనిపించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (12), దీప్తి శర్మ (1), రిచా ఘోష్ (3) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో తుమీ సెఖుఖునే, క్లోయ్ ట్రయాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి తలో 3 వికెట్లు పడగొట్టారు.

Also Read: పుంజుకున్న ఎల‌క్ట్రిక్ కార్ల హ‌వా!!

8 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఘనవిజయం

148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఓపెనర్లు లారా వోల్వార్డ్, సునే లుస్ భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. లారా 34 బంతుల్లో 54 పరుగులు చేయగా, లుస్ 46 బంతుల్లో 57 పరుగులు సాధించింది. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 72 బంతుల్లో 106 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్‌ను భారత్ నుండి దూరం చేశారు. దక్షిణాఫ్రికా కేవలం 17.1 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్ మాత్రమే వికెట్లు తీయగలిగింది. ఆమె 4 ఓవర్లలో 35 పరుగులిచ్చి 2 వికెట్లు సాధించింది. మిగిలిన బౌలర్లు ఎవరూ వికెట్లు తీయలేకపోవడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు.

  Last Updated: 19 Apr 2026, 10:08 PM IST