Chinnaswamy Stadium: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ 2026 సీజన్ తొలి మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని అందుకుంది. విరాట్ కోహ్లీ తన అద్భుత ప్రదర్శనతో జట్టుకు 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందించారు. ఈ గెలుపుతో అభిమానులు ఎంతో ఖుషీగా ఉన్నప్పటికీ చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ చూడటానికి వెళ్లిన కొందరు అభిమానులకు మాత్రం చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం దీని గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ మ్యాచ్ సమయంలో దొంగలకు అక్షరాలా లాటరీ తగిలింది. కింగ్ కోహ్లీ అభిమానులు వారి బాధితులుగా మారారు.
చిన్నస్వామి స్టేడియంలో దొంగల బీభత్సం
బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2026 ఓపెనింగ్ మ్యాచ్‌లో దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. స్టేడియానికి వచ్చిన చాలా మంది క్రికెట్ అభిమానుల ఫోన్లను దొంగిలించారు. దీనిపై బాధితులు సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ ఫిర్యాదులు చేస్తున్నారు. దాదాపు ఏడాది కాలం తర్వాత విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్‌లోకి తిరిగి రావడంతో ఆయన ఆటను చూడటానికి అభిమానులు భారీ సంఖ్యలో స్టేడియానికి తరలివచ్చారు. రద్దీని అదునుగా చేసుకున్న దొంగలు కోహ్లీ అభిమానులకు భారీ నష్టాన్ని మిగిల్చారు. విరాట్ బ్యాటింగ్ చూసి అభిమానులు సంతోషించినా, ఫోన్లు పోగొట్టుకోవడంతో ఆనందం ఆవిరైంది. భవిష్యత్తులో జరగబోయే మ్యాచ్‌ల సమయంలో అభిమానులు మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: కేకేఆర్ ఫ్యాన్‌కు ముంబై ఇండియన్స్ ఫ్యాన్ ప్రపోజ్!
ఆర్‌సీబీకి అద్భుత విజయం
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ 80 పరుగులతో రాణించారు. ఆర్‌సీబీ బౌలర్లలో జాకబ్ డఫీ, రొమారియో షెపర్డ్ తలో 3 వికెట్లు పడగొట్టారు.
అనంతరం 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ.. కేవలం 16 ఓవర్లలోనే 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. విరాట్ కోహ్లీ 69 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, దేవదత్ పడిక్కల్ 61 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆర్‌సీబీ జట్టుకు ఈ సీజన్‌లో ఘనమైన ఆరంభం లభించింది.
