RCB On Sale: సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సీఈఓ అదార్ పూనావాలా రాబోయే కొద్ది నెలల్లో ఐపీఎల్ ఫ్రాంచైజీ ఆర్‌సీబీ కొనుగోలు కోసం ఒక ‘స్ట్రాంగ్- కాంపిటీటివ్’ బిడ్‌ను వేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఆర్‌సీబీ యాజమాన్య హక్కులు డయాజియో నియంత్రణలో ఉన్న యునైటెడ్ స్పిరిట్స్ వద్ద ఉన్నాయి. వార్తల ప్రకారం.. ఈ ఫ్రాంచైజీని విక్రయించడానికి వారు 2 బిలియన్ డాలర్లు డిమాండ్ చేశారు.
అదార్ పూనావాలా ఎక్స్ (X) వేదికగా స్పందిస్తూ.. “రాబోయే కొద్ది నెలల్లో ఐపీఎల్‌లోని అత్యుత్తమ జట్లలో ఒకటైన @RCBTweets కోసం నేను బలమైన, పోటీతత్వంతో కూడిన బిడ్‌ను వేస్తాను” అని రాశారు.
Also Read: అజూర్ ఎయిర్‌లైన్స్ విమానం అత్యవసర ల్యాండింగ్.. 238 మంది ప్రయాణికులు సురక్షితం!
2025లోనే అందిన సంకేతాలు
అక్టోబర్ 2025లోనే అదార్ పూనావాలా ఎక్స్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేస్తూ.. “సరైన వాల్యుయేషన్ ఉంటే @RCBTweets ఒక అద్భుతమైన టీమ్” అని పేర్కొన్నారు. పూనావాలా సందేశం చిన్నదైనప్పటికీ అది సరైన సమయంలో రావడంతో పరిశ్రమ వర్గాల్లో చర్చకు దారితీసింది. మాజీ ఐపీఎల్ కమిషనర్ లలిత్ మోదీ కూడా ఆర్‌సీబీ ఒక ‘ప్రైమ్ ఇన్వెస్ట్‌మెంట్’ అని బహిరంగంగా సూచించారు. గ్లోబల్ లేదా సావరిన్ ఫండ్స్ ఈ ఫ్రాంచైజీ కోసం క్యూ కడతాయని ఆయన అభిప్రాయపడటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.
అత్యంత విలువైన ఫ్రాంచైజీగా అవతరించే అవకాశం
ఒకవేళ ఈ డీల్ 2 బిలియన్ డాలర్ల (రూ. 1,83,14,05,00,000) వద్ద జరిగితే క్రికెట్ చరిత్రలోనే అత్యంత విలువైన సింగిల్-టీమ్ ప్రాపర్టీలలో ఒకటిగా ఆర్‌సీబీ నిలుస్తుంది. ఈ విక్రయ ప్రక్రియను పర్యవేక్షించడానికి గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ సిటీని లావాదేవీల సలహాదారుగా నియమించినట్లు కూడా సమాచారం.
LSG కంటే రెట్టింపు వాల్యుయేషన్
ఈ ప్రతిపాదిత విక్రయం పూర్తయితే ఇటీవలే అత్యధిక ధరకు అమ్ముడైన లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కంటే ఇది రెట్టింపు కంటే ఎక్కువ వాల్యుయేషన్‌ను కలిగి ఉంటుంది. ఆర్పీఎస్‌జీ (RPSG) గ్రూప్ అప్పట్లో లక్నో టీమ్‌ను రూ. 7,090 కోట్లకు కొనుగోలు చేసింది.
గమనిస్తే.. 2008 ఐపీఎల్ వేలంలో విజయ్ మాల్యాకు చెందిన యూబీ గ్రూప్ ఆర్‌సీబీని సుమారు 111.6 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత దశాబ్ద కాలంలో లండన్ లిస్టెడ్ దిగ్గజం డయాజియో.. యునైటెడ్ స్పిరిట్స్‌లో నియంత్రణ వాటాను పొందింది. 2014 నాటికి మెజారిటీ వాటాదారుగా మారింది.
