T20 World Cup: శ్రీలంకలోని కొలంబో వేదికగా ఫిబ్రవరి 15న జరగాల్సిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు సంబంధించి సంచలన వార్తలు వస్తున్నాయి. పాకిస్థాన్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ దేశ క్రికెట్ బోర్డు (PCB) ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని నిర్ణయించుకుంది. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తీవ్రంగా స్పందించింది. తాజా నివేదికల ప్రకారం.. ఐసీసీ పాకిస్థాన్‌పై కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతోంది. దీంతో పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) 2026 మనుగడ కూడా ప్రమాదంలో పడింది. ఐసీసీ చర్యలు ప్రారంభమైన తర్వాతే పీసీబీకి తమ తప్పు తెలిసొచ్చేలా ఉంది.
పాకిస్థాన్ సూపర్ లీగ్ సర్వనాశనం అయ్యే అవకాశం
మీడియా నివేదికల ప్రకారం.. ఐసీసీ పీఎస్ఎల్ (PSL)లో విదేశీ ఆటగాళ్ల ప్రవేశాన్ని నిలిపివేయవచ్చు. ఐసీసీ గనుక ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ బోర్డులను తమ ఆటగాళ్లకు పీఎస్ఎల్ 2026 కోసం NOC (అభ్యంతర పత్రం) ఇవ్వవద్దని ఆదేశిస్తే విదేశీ స్టార్లు ఎవరూ ఈ లీగ్‌లో కనిపించరు. అప్పుడు కేవలం స్థానిక పాకిస్థానీ ఆటగాళ్లతోనే లీగ్ నడపాల్సి వస్తుంది.
Also Read: పీఎఫ్ ఖాతాదారులకు మరో శుభవార్త..!
విదేశీ ఆటగాళ్లు లేకపోతే బ్రాడ్‌కాస్టర్లు (ప్రసారకర్తలు) కూడా ఈ లీగ్ నుండి తప్పుకునే అవకాశం ఉంది. దీనివల్ల పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు కనీసం 50 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లుతుంది. అంతేకాకుండా ఈ లీగ్‌కు ఉన్న గుర్తింపును కూడా ఐసీసీ రద్దు చేయవచ్చు. అదే జరిగితే పీఎస్ఎల్ 2026 పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది.
పీసీబీ ఉనికికే ముప్పు
ఐసీసీ తీసుకోబోయే నిర్ణయాలు కేవలం పీఎస్ఎల్ మీదనే కాకుండా మొత్తం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మీదే భారం కానున్నాయి. బ్రాడ్‌కాస్టర్ జియోస్టార్‌కు పీసీబీ 315 కోట్ల రూపాయలను జరిమానాగా చెల్లించాల్సి రావచ్చు. ఐసీసీ నుంచి అందాల్సిన 285 కోట్ల రూపాయల వార్షిక ఆదాయాన్ని కూడా నిలిపివేసే అవకాశం ఉంది. రాబోయే ఐసీసీ టోర్నమెంట్ల నుండి పాకిస్థాన్‌ను పక్కన పెట్టవచ్చు. ఆసియా కప్ నుండి కూడా పాకిస్థాన్‌ను తప్పించే దిశగా ఐసీసీ ఆలోచిస్తోంది. ప్రస్తుతానికి ఐసీసీ ఈ విషయంపై అందరితో చర్చించడానికి కొంత సమయం తీసుకుంటోంది. పాకిస్థాన్ కూడా తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవడానికి ఐసీసీ కొంత గడువు ఇచ్చింది.
