టీమిండియాకు ఇది పెద్ద శుభవార్త. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దాదాపు పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆడేందుకు అతడికి మార్గం సుగమమైంది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)లో నిర్వహించిన పరీక్షల్లో పాండ్యా ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో వెన్నునొప్పి కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమైన హార్దిక్‌ను ఫిట్‌నెస్ కోసం సీఓఈకి పంపించారు. “జూన్ 2 నుంచి హార్దిక్ ఇక్కడే ఉన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో అతను చాలా బాగా రాణిస్తున్నాడు. వన్డే సిరీస్‌కు అతడు అందుబాటులో ఉండటం దాదాపు ఖాయం” అని సంబంధిత వర్గాలు ఐఏఎన్‌ఎస్‌కు తెలిపాయి. 2027 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని జట్టును సిద్ధం చేస్తున్న తరుణంలో పాండ్యా పునరాగమనం భారత్‌కు ఎంతో కీలకం.
మరోవైపు రోహిత్ శర్మ ఈ సిరీస్‌లో ఆడటంపై ఇంకా స్పష్టత రాలేదు. ఐపీఎల్‌లో తొడ కండరాల గాయంతో బాధపడిన రోహిత్ ఫిట్‌నెస్‌పై తుది నివేదిక రావాల్సి ఉంది. ఇదే గాయం కారణంగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు. అతడి స్థానంలో యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌ను జట్టులోకి తీసుకున్నారు.
భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ జూన్ 13న ధర్మశాలలో జరగనుంది. ఆ తర్వాత జూన్ 17న లక్నో, జూన్ 20న చెన్నైలో మిగతా రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ సిరీస్ ముగిశాక ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే వన్డే జట్టును ఎంపిక చేయనున్నారు.
