PSL: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)కి మరో ఎదురుదెబ్బ తగిలింది. కొందరు అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లు పీఎస్ఎల్ (PSL)ను వదిలి ఐపీఎల్ (IPL) వైపు వెళ్లడమే కాకుండా ఇప్పుడు లీగ్‌లో భారీ కోతలను కూడా ప్రకటించారు. ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ కొన్ని కీలక ప్రకటనలు చేశారు. ఈ టోర్నమెంట్ కేవలం రెండు వేదికల్లోనే జరుగుతుందని, స్టేడియంలోకి ప్రేక్షకులకు అనుమతి ఉండదని ఆయన ధృవీకరించారు.
ఇప్పుడు ఈ రెండు చోట్లే మ్యాచ్‌లు
పీఎస్ఎల్ 2026 ప్రారంభంలో ముల్తాన్, పెషావర్, ఫైసలాబాద్, కరాచీ, రావల్పిండి, లాహోర్‌లలో జరగాల్సి ఉంది. కానీ ఇప్పుడు కేవలం కరాచీ, లాహోర్ మాత్రమే ఈ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. వాస్తవానికి ప్రారంభ వేడుకను కూడా రద్దు చేశారు. ‘జియో సూపర్’ కథనం ప్రకారం.. “పీఎస్ఎల్ గురించి గత కొద్ది రోజులుగా చర్చలు జరుగుతున్నాయి” అని నఖ్వీ తెలిపారు.
Also Read: మరోసారి లాక్ డౌన్ తప్పదా?!
ఇబ్బంది పెట్టిన పరిస్థితులు
నఖ్వీ మాట్లాడుతూ.. “ప్రస్తుత పరిస్థితులు ఎంతకాలం కొనసాగుతాయో మాకు తెలియదు. కానీ PSL నిర్వహించడం చాలా అవసరం. ఇది ఒక అంతర్జాతీయ బ్రాండ్. ఇందులో విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. పీఎస్ఎల్ ముందుకు సాగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఈ మార్పులు ఉన్నప్పటికీ పీఎస్ఎల్ 2026 మార్చి 26న ప్రారంభమవుతుంది” అని చెప్పారు.
వాయిదా వేసే అవకాశం లేదు
“ఒకవేళ మేము పీఎస్ఎల్‌ను వాయిదా వేసి ఉంటే, తర్వాత నిర్వహించడానికి మాకు సమయం ఉండేది కాదు. జట్ల ప్రయాణాలను తగ్గించేలా మేము కొత్త షెడ్యూల్‌ను రూపొందించాము. అభిమానులు తమ టికెట్ డబ్బును రీఫండ్ పొందవచ్చు. వారికి కలిగిన అసౌకర్యానికి మేము క్షమాపణలు కోరుతున్నాము” అని ఆయన పేర్కొన్నారు. మధ్యప్రాచ్య సంక్షోభం కారణంగా పాకిస్థాన్‌కు ముడి చమురు సరఫరా ఆగిపోవడం, తద్వారా ఏర్పడిన ఇంధన కొరత వల్లే ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది.
ఐపీఎల్ వైపు మళ్లిన విదేశీ ఆటగాళ్లు
మరో ఆందోళనకర విషయం ఏమిటంటే.. పీఎస్ఎల్ 2026, ఐపీఎల్ 2026 ఒకే సమయంలో జరుగుతుండటంతో, కొందరు విదేశీ స్టార్ ఆటగాళ్లు ఇప్పటికే పాకిస్థానీ లీగ్ నుండి తప్పుకున్నాడు. జింబాబ్వేకు చెందిన బ్లెస్సింగ్ ముజరబానీ ఇస్లామాబాద్ యునైటెడ్‌ను వదిలి కేకేఆర్ (KKR)లో చేరాలని నిర్ణయించుకోగా, సామ్ కర్రన్ స్థానంలో దసున్ షనక లాహోర్‌ను వదిలి రాజస్థాన్ రాయల్స్ (RR)లో భాగమయ్యాడు.
