పద్దెనిమిదేళ్లు.. ఒకే ఒక్క టైటిల్ కోసం ఆ జట్టు పడ్డ తపన, అభిమానులు ఎదురుచూసిన నిరీక్షణ అంతా ఇంతా కాదు. కానీ, గెలిచిన టైటిల్‌ను తిరిగి నిలబెట్టుకోవడానికి వారికి పట్టిన సమయం మాత్రం కేవలం పన్నెండు నెలలే! అవును, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఇప్పుడు ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త చరిత్రను లిఖించింది. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తర్వాత లీగ్‌లో తమకంటూ ఒక తిరుగులేని సామ్రాజ్యాన్ని సృష్టించుకుంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో లక్షలాది మంది అభిమానుల కేరింతల మధ్య జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ ఘనవిజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసి, వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని గర్వంగా ముద్దాడింది.
ఒత్తిడిలో ‘కింగ్’ కోహ్లీ విశ్వరూపం!
గుజరాత్ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఆరంభంలోనే గట్టి షాక్‌లు తగిలాయి. ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (1), కెప్టెన్ రజత్ పాటిదార్ (15) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ఆ తర్వాత వచ్చిన వెంకటేశ్ అయ్యర్ (32), టిమ్ డేవిడ్ (24) ఉపయోగకరమైన పరుగులు చేసినా.. మ్యాచ్‌ను మలుపు తిప్పింది మాత్రం రన్ మెషీన్ విరాట్ కోహ్లీనే. ఒత్తిడిని జయించడంలో తనకు సాటిలేరని కోహ్లీ మరోసారి నిరూపించాడు. గుజరాత్ స్పిన్ మాంత్రికుడు రషీద్ ఖాన్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూనే, పేసర్లపై ఎదురుదాడికి దిగాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ.. కేవలం 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చివరిలో సిక్సర్‌తో మ్యాచ్ ముగించి ఆర్‌సీబీ అభిమానుల కలని నిజం చేశాడు. మరో 12 బంతులు మిగిలి ఉండగానే ఆర్సీబీ లక్ష్యాన్ని ఛేదించింది.
చరిత్ర సృష్టించిన రజత్ పటీదార్
ఐపీఎల్ చరిత్రలో ఎంఎస్ ధోనీ (CSK), రోహిత్ శర్మ (MI)ల తర్వాత వరుసగా రెండు సీజన్లలో టైటిళ్లు గెలిచిన మూడో కెప్టెన్‌గా రజత్ పటీదార్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 2025లో జట్టుకు తొలి ట్రోఫీ అందించిన పటీదార్, ఇప్పుడు 2026లోనూ ఆర్‌సీబీని విజేతగా నిలిపాడు.
గతంలో ఆర్సీబీ అభిమానులు ఎంతో ఆశగా పలికిన “ఈ సాలా కప్ నమదే” (ఈసారి కప్పు మనదే) అనే నినాదం.. ఇప్పుడు వరుస విజయాలతో “ఎప్పటికీ కప్ నమదే” (కప్ ఎప్పటికీ మాదే) అన్నంత ధీమాగా బెంగళూరు వీధుల్లో మార్మోగుతోంది.
