ఐపీఎల్ 2026 షెడ్యూల్.. మార్చి 28న తొలి మ్యాచ్‌?

బ్రాడ్‌కాస్టర్ 'స్టార్ స్పోర్ట్స్' టీవీ లిస్టింగ్ ప్రకారం.. ఐపీఎల్ 2026 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను సోమవారం ప్రకటిస్తారని సంకేతాలు అందాయి.

Published By: HashtagU Telugu Desk
IPL History

IPL History

IPL 2026: ఐపీఎల్ 2026 షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులు మరికొంత కాలం వేచి చూడాల్సిందే. మొదట ఐపీఎల్ 2026 పూర్తి షెడ్యూల్ మార్చి 8న విడుదలవుతుందని భావించినప్పటికీ ఇప్పుడు నేటికి వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం.. టోర్నమెంట్ షెడ్యూల్ మార్చి 9న (సోమవారం) సాయంత్రం 4 లేదా 6 గంటల సమయంలో విడుదలయ్యే అవకాశం ఉంది.

బ్రాడ్‌కాస్టర్ ‘స్టార్ స్పోర్ట్స్’ టీవీ లిస్టింగ్ ప్రకారం.. ఐపీఎల్ 2026 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను సోమవారం ప్రకటిస్తారని సంకేతాలు అందాయి. ఇక టోర్నమెంట్ మార్చి 28 నుండి ప్రారంభం కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. గతంలో మార్చి 26న ప్రారంభమవుతుందని భావించినా, ఇప్పుడు రెండు రోజుల ఆలస్యంతో మొదలయ్యేలా కనిపిస్తోంది. షెడ్యూల్ విడుదలయ్యాక తొలి మ్యాచ్ ఏ జట్ల మధ్య జరుగుతుందనే దానిపై స్పష్టత రానుంది.

రెండు దశల్లో ప్రకటన

నివేదికల ప్రకారం, గత ఎన్నికల సంవత్సరాల మాదిరిగానే ఈసారి కూడా బీసీసీఐ (BCCI) షెడ్యూల్‌ను “స్టాగర్డ్ రిలీజ్” (దశలవారీగా) పద్ధతిలో విడుదల చేయవచ్చు. అంటే మొదట కేవలం మొదటి 15 నుండి 20 రోజుల మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటిస్తారు. మిగిలిన మ్యాచ్‌ల తేదీలను తర్వాత విడుదల చేసే అవకాశం ఉంది.

Also Read: క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

తొలి మ్యాచ్ ఎక్కడ?

నివేదికల ప్రకారం.. టోర్నమెంట్ తొలి మ్యాచ్ ప్రస్తుత ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హోమ్ గ్రౌండ్ అయిన ‘ఎం. చిన్నస్వామి స్టేడియం’లో జరగవచ్చు. ఈ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు 2025 రన్నరప్ పంజాబ్ కింగ్స్‌తో తలపడే అవకాశం ఉంది. అయితే షెడ్యూల్ విడుదలైన తర్వాతే దీనిపై అధికారిక ప్రకటన వస్తుంది.

కొన్ని జట్లకు రెండు హోమ్ గ్రౌండ్‌లు

ఈసారి కొన్ని జట్లు తమ హోమ్ మ్యాచ్‌లను రెండు వేర్వేరు నగరాల్లో ఆడే అవకాశం ఉంది. ఉదాహరణకు బెంగళూరు జట్టు తన కొన్ని మ్యాచ్‌లను రాయ్‌పూర్‌లో ఆడవచ్చు. అలాగే రాజస్థాన్ రాయల్స్ గౌహతిని తన రెండో హోమ్ గ్రౌండ్‌గా ఉపయోగించుకోవచ్చు.

ఎన్నికల కారణంగా షెడ్యూల్ ప్లాన్ మార్పు

ఐపీఎల్ షెడ్యూల్‌ను దశలవారీగా విడుదల చేయడానికి ప్రధాన కారణం రాబోయే అసెంబ్లీ ఎన్నికలు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలలో మార్చి నుండి మే మధ్య ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. భద్రత, ఇతర ఏర్పాట్లను దృష్టిలో ఉంచుకుని నిర్వాహకులు ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఇప్పుడు క్రికెట్ అభిమానుల కళ్లన్నీ ఐపీఎల్‌పైనే ఉన్నాయి. సోమవారం షెడ్యూల్ విడుదలైన వెంటనే టోర్నీపై ఉత్సాహం మరింత పెరగనుంది.

  Last Updated: 09 Mar 2026, 03:16 PM IST