IND vs SA: భారత్- సౌతాఫ్రికా జట్ల మధ్య ఫిబ్రవరి 22న జరగనున్న టీ20 వరల్డ్ కప్ సూపర్-8 పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. లీగ్ స్టేజ్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఘనవిజయం సాధించి అజేయంగా నిలిచిన టీమ్ ఇండియా ఇప్పుడు అదే జోరును సూపర్-8 దశలోనూ కొనసాగించాలని పట్టుదలతో ఉంది. అయితే ఈ కీలక మ్యాచ్‌కు ముందు భారత యువ బ్యాటర్ అభిషేక్ శర్మ ఫామ్, అతని బ్యాటింగ్ శైలి జట్టు యాజమాన్యానికి పెద్ద ఆందోళనగా మారింది.
అభిషేక్ శర్మ ప్రస్తుత ఆటతీరును విశ్లేషించిన క్రీడా పండితులు అతని బ్యాటింగ్‌లో మూడు ప్రధాన బలహీనతలను ఎత్తిచూపుతున్నారు. ఈ లోపాలను సరిదిద్దుకోకపోతే సూపర్-8లో భారత్‌కు కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
అభిషేక్ శర్మ బలహీనతలు ఇవే
తొలి బంతి నుంచే భారీ షాట్లకు ప్రయత్నించడం
అభిషేక్ శర్మ అనుసరిస్తున్న అత్యంత ప్రమాదకరమైన ధోరణి ఇది. పిచ్ స్వభావాన్ని గానీ, బౌలర్ వేగంతో పాటు స్వింగ్‌ను గానీ అంచనా వేయకుండా క్రీజులోకి వచ్చిన మొదటి బంతి నుంచే సిక్సర్లు కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. ఆధునిక టీ20 క్రికెట్‌లో అగ్రెసివ్ బ్యాటింగ్ అవసరమే అయినప్పటికీ బంతిని సరిగ్గా గమనించకుండా ఆడే ఈ శైలి వల్ల అతను త్వరగా వికెట్ పారేసుకుంటున్నాడు.
Also Read: Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్
పవర్ ప్లేలో స్పిన్నర్ల వద్ద ఇబ్బంది పడటం
సాధారణంగా అభిషేక్ శర్మ స్పిన్ బౌలింగ్‌ను అద్భుతంగా ఆడతాడని పేరుంది. కానీ ఈ టోర్నీలో పరిస్థితి భిన్నంగా ఉంది. పవర్ ప్లే ఓవర్లలో ప్రత్యర్థి జట్లు స్పిన్నర్లను రంగంలోకి దించినప్పుడు అభిషేక్ తడబడుతున్నాడు. ముఖ్యంగా బంతి గమనాన్ని అంచనా వేయడంలో విఫలమై అనవసర ఒత్తిడికి లోనవుతున్నాడు. సౌతాఫ్రికా వంటి జట్ల వద్ద నాణ్యమైన స్పిన్నర్లు ఉన్న నేపథ్యంలో ఇది భారత్‌కు మైనస్ కావచ్చు.
వరుసగా డకౌట్ అవ్వడం
అభిషేక్ శర్మ గణాంకాలు ప్రస్తుతం భయాన్ని కలిగిస్తున్నాయి. గత మూడు మ్యాచ్‌ల్లో అతను ‘0’ పరుగులకే అవుట్ కావడం విశేషం. కీలకమైన ఓపెనింగ్ స్థానంలో వచ్చి ఇలా వరుసగా డకౌట్ అవ్వడం వల్ల మిడిల్ ఆర్డర్ బ్యాటర్లపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. టీమ్ ఇండియాకు మంచి ఆరంభం లభించకపోవడం పెద్ద సమస్యగా మారుతోంది.
