Ishan Kishan: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో అత్యంత భారీ పోరు కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. నెమ్మదైన వికెట్‌పై టీమ్ ఇండియాకు ఆశించిన ఆరంభం లభించలేదు. కానీ ఒక వైపు నుండి ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి రికార్డుల వర్షం కురిపించాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ, మహమ్మద్ రిజ్వాన్ వంటి దిగ్గజాలున్న ప్రత్యేక క్లబ్‌లో కిషన్ చేరిపోయాడు.
ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్
స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఖాతా తెరవకుండానే నాలుగో బంతికి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత బాధ్యత తీసుకున్న వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కేవలం 40 బంతుల్లోనే 77 పరుగులు చేశాడు. 192.50 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన కిషన్, తన ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 3 భారీ సిక్సర్లు బాదాడు. కేవలం పవర్‌ప్లేలోనే అతను 42 పరుగులు పిండుకోవడం విశేషం.
Also Read: డేటింగ్ అంటూ ఆ హీరో తనను మోసం చేశాడంటూ నాగ్ హీరోయిన్ కన్నీరు
భారత్-పాకిస్థాన్ టీ20 మ్యాచ్ పవర్‌ప్లేలో అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా కిషన్ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు శుభ్‌మన్ గిల్ (2025 ఆసియా కప్‌లో 35 పరుగులు) పేరిట ఉండేది. అంతేకాకుండా, టీ20 వరల్డ్ కప్ 2026లో కిషన్‌కు ఇది వరుసగా రెండో అర్ధ సెంచరీ. దీనికి ముందు నమీబియాపై అతను 24 బంతుల్లో 61 పరుగులు చేశాడు.
కోహ్లీ రికార్డుల క్లబ్‌లోకి
టీ20 వరల్డ్ కప్ చరిత్రలో భారత్-పాక్ మధ్య జరిగిన మ్యాచ్‌లలో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ చేసిన ఆటగాడిగా ఇషాన్ కిషన్ (27 బంతుల్లో) నిలిచాడు. గతంలో ఇఫ్తికార్ అహ్మద్ 32 బంతుల్లో ఈ ఘనత సాధించాడు. మొత్తంగా భారత్-పాక్ టీ20 చరిత్రలో వేగవంతమైన హాఫ్ సెంచరీల జాబితాలో కిషన్ మూడో స్థానానికి చేరుకున్నాడు. (మహమ్మద్ హఫీజ్ 23 బంతులు, అభిషేక్ శర్మ 24 బంతుల్లో సాధించారు). ఇక భారత్-పాక్ పోరులో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు విరాట్ కోహ్లీ (నాటౌట్ 82, నాటౌట్ 78) పేరిట ఉండగా, మహమ్మద్ రిజ్వాన్ (నాటౌట్ 79) తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు కిషన్ 77 పరుగులతో నాలుగో స్థానానికి చేరుకున్నాడు.
