Mercedes-Benz V-Class టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన ప్రేయసి మహికా శర్మపై ప్రేమను వినూత్నంగా చాటుకున్నాడు. తన ఆన్-ఫీల్డ్ విజయాల వెనుక ఆమె ప్రోత్సాహం ఉందని పలు సందర్భాల్లో చెప్పిన పాండ్యా, ఇప్పుడు ఆమెకు ఒక ఖరీదైన బహుమతిని ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. సుమారు రూ. 1.7 కోట్ల విలువైన మెర్సిడెస్-బెంజ్ వి-క్లాస్ లగ్జరీ కారును మహికాకు బహుమతిగా ఇచ్చాడు. విశేషమేమిటంటే, ఈ మోడల్ కారును ఇండియాలో అందుకున్న మొట్టమొదటి వ్యక్తి మహికానే కావడం.
కొద్ది వారాల క్రితమే హార్దిక్ పాండ్యా రూ. 12 కోట్ల విలువైన అల్ట్రా-లగ్జరీ ఫెరారీ కారును కొనుగోలు చేశాడు. ఇప్పుడు తన ప్రేయసి కోసం కొత్తగా విడుదలైన ఈ ప్రీమియం వాహనాన్ని బహుమతిగా అందించాడు. అత్యంత విశాలంగా, ఆధునికంగా ఉండే ఈ కారుతో హార్దిక్, మహికా కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. ఈ జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇక క్రికెట్ విషయానికొస్తే, ఐపీఎల్ 2026 సీజన్‌లో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ శుభారంభం చేసింది. ఆదివారం వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది.
