సెమీస్ ముందు ఇండియాకు గ‌వాస్క‌ర్ వార్నింగ్

Sunil Gavaskar  టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఎల్లుండి ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ మధ్య జరగనున్న సెమీఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా, హోరాహోరీగా సాగుతుందని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ జోస్యం చెప్పాడు. అయితే, జస్‌ప్రీత్ బుమ్రా వంటి అద్భుతమైన బౌలర్ ఉండటం, బ్యాటింగ్ ఆర్డర్‌లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ కారణంగా ఆతిథ్య టీమిండియాకే స్వల్పంగా గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డాడు. 2022, 2024 తర్వాత ఇరు జట్లు మరోసారి సెమీఫైనల్‌లో తలపడనున్నాయి. ఈ […]

Published By: HashtagU Telugu Desk
Sunil Gavaskar

Sunil Gavaskar

Sunil Gavaskar  టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఎల్లుండి ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ మధ్య జరగనున్న సెమీఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా, హోరాహోరీగా సాగుతుందని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ జోస్యం చెప్పాడు. అయితే, జస్‌ప్రీత్ బుమ్రా వంటి అద్భుతమైన బౌలర్ ఉండటం, బ్యాటింగ్ ఆర్డర్‌లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ కారణంగా ఆతిథ్య టీమిండియాకే స్వల్పంగా గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డాడు.

2022, 2024 తర్వాత ఇరు జట్లు మరోసారి సెమీఫైనల్‌లో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో గవాస్కర్ మాట్లాడుతూ.. “రెండు జట్లూ అన్ని విభాగాల్లో సమఉజ్జీలుగా ఉన్నాయి. ఇరు జట్లలోనూ అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్‌లు ఉన్నాయి. మిడిల్ ఆర్డర్ బలంగా ఉంది, మంచి ఫినిషర్లు కూడా ఉన్నారు. ఇంగ్లండ్ జట్టులోని కొంతమంది ఆటగాళ్లకు ఐపీఎల్ ఆడిన అనుభవం ఉంది. వారికి భారత పిచ్‌లపై, నాకౌట్ మ్యాచ్‌ల ఒత్తిడిపై మంచి అవగాహన ఉంటుంది. అందుకే ఇది హోరాహోరీ మ్యాచ్ అవుతుంది” అని వివరించాడు.

అయితే, ఈ మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించేది జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగేనని గవాస్కర్ స్పష్టం చేశాడు. ముఖ్యంగా పవర్‌ప్లేలోనే బుమ్రాతో కనీసం రెండు ఓవర్లు వేయించాలని సూచించాడు. “పవర్‌ప్లేలో బుమ్రా బౌలింగ్‌కు వస్తే, జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్, హ్యారీ బ్రూక్ వంటి కీలక ఆటగాళ్ల వికెట్లు తీయగలడు. అలా జరిగితే ఇంగ్లండ్ బ్యాటింగ్ వెన్నెముక విరిచినట్లే అవుతుంది. అతని బౌలింగ్‌ను అంచనా వేయడం చాలా కష్టం. అందుకే అతను అన్ని ఫార్మాట్లలోనూ అత్యంత ప్రమాదకరమైన బౌలర్‌గా రాణిస్తున్నాడు” అని గవాస్కర్ తెలిపాడు.

భారత జట్టుకు ఉన్న మరో పెద్ద బలం బ్యాటింగ్ ఆర్డర్‌లోని ఫ్లెక్సిబిలిటీ అని, దానికి తిలక్ వర్మ చక్కటి ఉదాహరణ అని ఆయన ప్రశంసించాడు. “తిలక్ వర్మ చాలా స్మార్ట్ క్రికెటర్. పరిస్థితిని అంచనా వేసి, దానికి తగ్గట్లుగా ఆడతాడు. అతను నంబర్ 3లో, అవసరమైతే 5 లేదా 6వ స్థానంలో కూడా బ్యాటింగ్ చేయగలడు. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో సంజూ శాంసన్‌పై ఒత్తిడి తగ్గించి అతను ఆడిన తీరు అద్భుతం. తిలక్ లాంటి ఆటగాళ్లు జట్టులో ఉండటం భారత్ అదృష్టం” అని అన్నాడు.

ఇదే సమయంలో ఈ టోర్నీలో పెద్దగా రాణించకపోయినా ఇంగ్లండ్ సీనియర్ ఆటగాడు జోస్ బట్లర్‌ను తేలిగ్గా తీసుకోవద్దని గవాస్కర్ హెచ్చరించాడు. “ఫామ్‌లో లేకపోవచ్చు కానీ… బట్లర్ కూడా అభిషేక్ శర్మ లాంటి ప్రమాదకరమైన ఆటగాడు. అతని వికెట్‌ను త్వరగా తీయడం భారత్‌కు చాలా ముఖ్యం. గురువారం నాడు అతను ఫామ్ అందుకోకూడదని ఆశిద్దాం” అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

  Last Updated: 03 Mar 2026, 03:00 PM IST