CSK Mega Reunion: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 19వ సీజన్ మార్చి 28 నుండి ప్రారంభం కానుంది. ఇందుకోసం మొత్తం 10 జట్లు తమ సన్నాహాల్లో నిమగ్నమై ఉన్నాయి. అయితే ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు మార్చి 22, ఆదివారం నాడు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం (చెపాక్) ఒక అద్భుతమైన దృశ్యానికి వేదిక కానుంది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కొత్త సీజన్ కంటే ముందే ఒక ‘మెగా రీయూనియన్’ ప్లాన్ చేసింది. ఇందులో జట్టు కోసం ఆడిన దిగ్గజ ఆటగాళ్లతో పాటు ప్రస్తుత నక్షత్రాలు కూడా సందడి చేయనున్నారు.
చెపాక్‌లో పండుగ వాతావరణం
ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్ మార్చి 28న బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది. అంతకంటే ముందే మార్చి 22న చెపాక్‌లో జరిగే ఈ వేడుక కోసం ఫ్రాంచైజీ మొదటి సీజన్ నుండి జట్టుతో ఉన్న మాజీ ఆటగాళ్లకు ఆహ్వానాలు పంపింది. ప్రస్తుతం ఇతర ఐపీఎల్ జట్లతో సంబంధం ఉన్న ఆటగాళ్లు కూడా ఈ రీయూనియన్‌లో భాగం కానుండటం విశేషం. నివేదికల ప్రకారం.. సన్‌రైజర్స్ హైదరాబాద్ సపోర్ట్ స్టాఫ్‌లో ఉన్న ముత్తయ్య మురళీధరన్, గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ కోచ్ మాథ్యూ హేడెన్, కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్ డ్వేన్ బ్రావో ఈ వేడుకకు హాజరుకానున్నారు.
Also Read: ఐపీఎల్ 2026.. అత్యధిక ధర కలిగిన టాప్-3 కెప్టెన్లు వీరే!
సురేష్ రైనా, ఇతర ఆటగాళ్ల రాక
ఈ ప్రత్యేక ఈవెంట్ కోసం CSK యాజమాన్యం ఇతర ఫ్రాంచైజీలతో కూడా సంప్రదింపులు జరిపింది. తమ కోచింగ్ స్టాఫ్‌లో ఉన్న మాజీ CSK ఆటగాళ్లకు ఒక్కరోజు సెలవు ఇవ్వాలని కోరింది. చెన్నై ‘చిన్న తల’ సురేష్ రైనా ఇప్పటికే తన రాకను ఖరారు చేశారు. అయితే ఆర్. అశ్విన్ ఆ రోజు అందుబాటులో ఉండటం లేదు. టీ20 వరల్డ్ కప్ 2026 విజేత జట్టులో సభ్యులైన సంజు శాంసన్, శివమ్ దూబే కూడా ఆ సమయానికి జట్టుతో చేరనున్నారు. ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ తన తొలి మ్యాచ్‌ను మార్చి 30న గౌహతిలో రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది. ఇక ఏప్రిల్ 3న పంజాబ్ కింగ్స్‌తో చెన్నైలో తమ మొదటి హోమ్ మ్యాచ్ ఆడనుంది.
