బీసీసీఐ ముందు అజిత్ అగార్కర్ బిగ్ రిక్వెస్ట్‌.. ఏంటంటే?

వైట్ బాల్ క్రికెట్‌లో (పరిమిత ఓవర్ల క్రికెట్) టీమ్ ఇండియా కొత్త శిఖరాలను తాకినప్పటికీ రెడ్ బాల్ క్రికెట్‌లో (టెస్ట్ క్రికెట్) మాత్రం తన ఆధిపత్యాన్ని కోల్పోతోంది.

Published By: HashtagU Telugu Desk
Ajit Agarkar

Ajit Agarkar

Ajit Agarkar: టీమ్ ఇండియా ఇటీవలే టీ20 ప్రపంచ కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో టైటిల్‌ను డిఫెండ్ చేసుకున్న (వరుసగా రెండోసారి నెగ్గిన) తొలి దేశంగా భారత్ అవతరించింది. ఈ విజయం తర్వాత ఒక ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. టీమ్ ఇండియాను టీ20లో ప్రపంచ విజేతగా నిలిపిన కీలక వ్యక్తి బీసీసీఐ (BCCI) ముందు ఒక ప్రత్యేక విన్నపాన్ని ఉంచారు. ఆ వ్యక్తి మరెవరో కాదు టీమ్ ఇండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్. ఓ కథనం ప్రకారం.. చీఫ్ సెలెక్టర్‌గా తన పదవీకాలాన్ని 2027 వన్డే వరల్డ్ కప్ వరకు పొడిగించాలని అగార్కర్ బోర్డును కోరారు. అయితే దీనిపై బీసీసీఐ నుండి ఇంకా ఎటువంటి అధికారిక స్పందన రాలేదు.

అగార్కర్ హయాంలో 3 ఐసీసీ టైటిల్స్

అజిత్ అగార్కర్‌ను 2023లో బీసీసీఐ టీమ్ ఇండియా చీఫ్ సెలెక్టర్‌గా నియమించింది. ఆయన సారథ్యంలో టీమ్ ఇండియా 2023 వన్డే ప్రపంచ కప్‌లో ఫైనల్ వరకు చేరుకుంది. అంతేకాకుండా భారత్ మూడు ఐసీసీ టైటిళ్లను గెలుచుకుంది. 2024లో టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. 2025లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో మరోసారి విజేతగా నిలిచి టైటిల్‌ను నిలబెట్టుకుంది.

Also Read: ఒకేసారి 9 దేశాలపై దాడి చేసిన ఇరాన్‌!

సొంతగడ్డపై టైటిల్‌ను డిఫెండ్ చేసుకున్న వారం రోజులకే అగార్కర్ ఈ కోరికను బీసీసీఐ ముందు ఉంచారు. ఐపీఎల్ 2025కి ముందే ఆయన పదవీకాలాన్ని ఏడాది పాటు పొడిగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనిపై బోర్డు నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.

రెడ్ బాల్ క్రికెట్‌లో ఎదురవుతున్న సవాళ్లు

వైట్ బాల్ క్రికెట్‌లో (పరిమిత ఓవర్ల క్రికెట్) టీమ్ ఇండియా కొత్త శిఖరాలను తాకినప్పటికీ రెడ్ బాల్ క్రికెట్‌లో (టెస్ట్ క్రికెట్) మాత్రం తన ఆధిపత్యాన్ని కోల్పోతోంది. భారత్ తన సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ను కోల్పోయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో జరిగిన ‘బోర్డర్-గావస్కర్ ట్రోఫీ’లోనూ ఓటమిని చవిచూసింది (గత రెండు సార్లు భారత్ ఇక్కడ వరుసగా గెలిచింది). ఇటీవల సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లోనూ టీమ్ ఇండియా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో అగార్కర్ పదవీకాలం పొడిగింపుపై నిర్ణయం తీసుకునే ముందు బీసీసీఐ ఈ వైఫల్యాలను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.

 

  Last Updated: 19 Mar 2026, 05:28 PM IST