Virat Kohli: విరాట్ కోహ్లీ (Virat Kohli) టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన రోజు మే 12. అంతకంటే ఐదు రోజులకు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ రెడ్-బాల్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ సమీపిస్తున్న సమయంలో విరాట్ రిటైర్మెంట్ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచే విషయంగా నిలిచింది. ఇప్పుడు ఐపీఎల్ చైర్మన్ (IPL Chairman 2025) అరుణ్ సింగ్ ధూమల్ విరాట్‌ను రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రత్యేకంగా కోరారు.
న్యూస్ ఏజెన్సీ PTIతో అరుణ్ సింగ్ ధూమల్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ తన మొదటి ఐపీఎల్ సీజన్‌తో పోలిస్తే ఇప్పుడు మరింత ఫిట్‌గా కనిపిస్తున్నారని అన్నారు. ఆర్సీబీ ట్రోఫీ గెలిచినా సరే కోహ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడటం కొనసాగించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
విరాట్‌ను రిటైర్మెంట్ ఉపసంహరించుకోమని కోరారు
విరాట్ కోహ్లీని టెస్ట్ రిటైర్మెంట్ నుండి వెనక్కి తీసుకోమని కోరుతూ అరుణ్ ధూమల్ ఒక ప్రకటన చేశారు. ‘‘దేశం మొత్తం విరాట్ కోహ్లీ ఆడటం కొనసాగించాలని కోరుకుంటోంది. నేను కూడా అతను టెస్ట్ రిటైర్మెంట్ నుండి వెనక్కి రావాలని ఆలోచించాలని కోరుకుంటున్నాను. అలాగే ఐపీఎల్ నుండి కూడా రిటైర్ కాకూడదని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే అతను క్రికెట్‌కు అతిపెద్ద అంబాసిడర్‌గా ఉన్నారు’’ అని ధూమల్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. అయితే కొన్ని సోషల్ మీడియా కథనాల ప్రకారం జూన్ 3న జరగబోయే ఐపీఎల్ ఫైనల్‌లో ఒకవేళ ఆర్సీబీ కప్ కొడితే కోహ్లీ ఐపీఎల్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.
అరుణ్ సింగ్ ధూమల్ గతంలో BCCI కోశాధికారిగా పనిచేశారు. అయితే ప్రస్తుతం ఆయనకు BCCIతో సంబంధం లేదు. కానీ ఐపీఎల్‌ను BCCI నిర్వహిస్తుంది కాబట్టి సాంకేతికంగా అరుణ్ ధూమల్ ఇప్పటికీ బోర్డు సభ్యుడిగా ఉన్నారు.
Also Read: MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత మరో కీలక ప్రకటన.. ఏంటంటే?
రెండు ఫార్మాట్ల నుండి రిటైర్ అయిన విరాట్ కోహ్లీ
భారత జట్టు 2024 టీ20 వరల్డ్ కప్ టైటిల్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ టీ20 ఫార్మాట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక ఐపీఎల్ 2025 మధ్యలో మే 12న విరాట్ టెస్ట్ ఫార్మాట్‌కు కూడా వీడ్కోలు పలికి, క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేశారు. ఇప్పుడు అభిమానులు విరాట్‌ను ఐపీఎల్, వన్డే మ్యాచ్‌లలో మాత్రమే చూడగలరు.