Abhishek Sharma: ఇంగ్లండ్ తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా బోణీ కొట్టింది. భారత విజయానికి ఓపెనర్ అభిషేక్ శర్మ ఎంతగా దోహదపడ్డాడో బౌలర్లు కూడా అంతే సహకారం అందించారు. తొలుత బౌలర్లు ఇంగ్లండ్ జట్టును స్వల్ప స్కోరుకే కుప్పకూల్చగా, ఛేదనలో ఓపెనర్ అభిషేక్ శర్మ అర్ధ సెంచరీతో చెలరేగాడు.
133 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ తరఫున అభిషేక్ శర్మ (Abhishek Sharma) 34 బంతుల్లో 79 పరుగులతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు. ఇన్నింగ్స్ లో అభిషేక్ 5 ఫోర్లు, 8 సిక్సర్లతో విలయతాండవం చేశాడు. తద్వారా అభిషేక్ శర్మ తన టీ20 కెరీర్‌లో రెండో అర్ధ సెంచరీని కేవలం 20 బంతుల్లోనే పూర్తి చేసుకున్నాడు. అభిషేక్ కు ఈ అర్ధ సెంచరీ చాలా ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే ఇంగ్లాండ్‌పై టి20లో ఒక భారతీయ బ్యాట్స్‌మన్ చేసిన రెండవ వేగవంతమైన అర్ధ సెంచరీ ఇదే. అభిషేక్ శర్మ కంటే ముందు యువరాజ్ సింగ్ 2007 టి20 ప్రపంచ కప్ సందర్భంగా ఇంగ్లాండ్‌పై వేగవంతమైన అర్ధ సెంచరీ సాధించాడు.
Also Read: Death Threats : కపిల్ శర్మ సహా నలుగురు సెలబ్రిటీలకు హత్య బెదిరింపు.. ఆ ఈమెయిల్‌లో ఏముంది ?
యువరాజ్ సింగ్ కేవలం 12 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ జాబితాలో కెఎల్ రాహుల్ పేరు మూడవ స్థానంలో ఉంది. 2018లో కేఎల్ మాంచెస్టర్‌లో ఇంగ్లాండ్‌పై 27 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేశాడు.నిజానికి యువరాజ్ సింగ్ ను అభిషేక్ శర్మ గురువుగా భావిస్తాడు. పంజాబ్‌కు చెందిన ఈ యువ బ్యాట్స్‌మన్‌కు యువరాజ్ సింగ్ కోచ్ గా కూడా వ్యవహరించాడు. దీంతో గురువు తగ్గ శిష్యుడిగా అభిషేక్ ను ప్రశంసిస్తున్నారు. అటు అభిషేక్ ఇన్నింగ్స్ పై యువీ ఆనందం వ్యక్తం చేశాడు. మరోవైపు అభిషేక్ భారీ ఇన్నింగ్స్ ద్వారా యువీని గుర్తు చేశాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే… టీమిండియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది.
భారత స్పిన్నర్లను ఎదుర్కొవడంలో ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్లు తేలిపోయారు. స్పిన్నర్ల ధాటికి ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోయారు. కెప్టెన్ బట్లర్ అత్యధకంగా 68 పరుగులు చేశాడు. మిగతా ఏడుగురు బ్యాట్స్‌మెన్లు రెండంకెల స్కోరును కూడా చేరుకోలేకపోయారు. వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు తీసుకోగా, అక్షర్, హార్దిక్, అర్ష్‌దీప్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 12.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.