Delhi BMW Road Accident: ఢిల్లీలో ఓ మహిళ ర్యాష్ డ్రైవింగ్ నిర్లక్ష్యానికి వ్యక్తి బలయ్యాడు. మోతీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున వేగంగా వెళ్తున్న బీఎండబ్ల్యూ కారు (మోడల్ 525ఐ) స్కూటీను ఢీకొట్టింది. ఈ ఘటనలో గాయపడిన స్కూటీ రైడర్‌ను ఆమె ఆస్పత్రికి తరలించగా, గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి పేరు అజయ్ గుప్తా. ఈ కేసులో నిందుతురాలిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నిర్లక్ష్యానికి కారణమైన సెక్షన్ కింద ఆమెను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ మహిళ వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్. అశోక్ విహార్‌లో నివాసం ఉంటున్నట్టు పోలీసుల సమాచారం.
మోతీ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున 04:08 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగినట్లు పోలీసులకు సమాచారం అందిందని పశ్చిమ జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఘనశ్యామ్ బన్సాల్ తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మోతీ నగర్ ఫ్లైఓవర్‌కు వెళ్లే రహదారిపై బీఎండబ్ల్యూ కారు, స్కూటీ దెబ్బతిన్నట్టు పోలీసులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన వ్యక్తిని సదరు మహిళా స్థానిక ఆచార్య భిక్షు ఆస్పత్రికి తరలించినట్టు విచారణలో తేలిందని అధికారులు తెలిపారు.
కాగా ప్రమాదంలో మరణించిన వ్యక్తి పేరు అజయ్ అని, అతడు కిరాణా దుకాణం నడుపుతున్నాడని విచారణలో తేలింది. ప్రమాదానికి కారణమైన ఆ మహిళ పార్టీకి హాజరై తిరిగి తన ఇంటికి వస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Read More: Ts Constable Exam Key : కానిస్టేబుల్ మెయిన్స్ ప్రిలిమినరీ ‘కీ’ రిలీజ్